ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారా.. పెద్దపేగు క్యాన్సర్ ముప్పుని కొని తెచ్చుకున్నట్టే..

ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారా.. పెద్దపేగు క్యాన్సర్ ముప్పుని కొని తెచ్చుకున్నట్టే..

మాస్ జనరల్ బ్రిఘం చేసిన ఒక కొత్త పరిశోధన ప్రకారం, అల్ట్రాప్రాసెస్డ్ ఫుడ్స్(తినడానికి సిద్ధంగా ఉండే ఆహారాలు) ఎక్కువగా తినడం వల్ల  50 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో పెద్దపేగు (Colon Cancer) వచ్చే ప్రమాదం ఎక్కువగా  ఉంటుంది.

 అధ్యయన వివరాల ప్రకారం JAMA ఆంకాలజీలో ఈ రిసర్చ్ ఫలితాలు ప్రచురించారు. పరిశోధకులు దాదాపు 30 వేల మంది మహిళల నుండి 20 సంవత్సరాలకు పైగా సేకరించిన డేటాను పరిశీలించారు. ఈ మహిళలంతా కూడా 50 ఏళ్లు వచ్చేలోపే కనీసం రెండుసార్లు పేగు పరీక్షలు చేయించుకున్నారు ఇంకా  ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి వారి ఆహార అలవాట్ల గురించి వివరంగా చెప్పారు.

 పరిశోధనలో తేలింది ఏంటంటే: రోజుకు మూడుసార్లు అల్ట్రాప్రాసెస్డ్ ఆహారాలు తినే మహిళలతో పోలిస్తే రోజుకు 10 సార్లు ఇటువంటి ఆహారాలు తినే మహిళలకు పేగుల్లో క్యాన్సర్‌గా మారే అవకాశం ఉన్న అడెనోమాలు లేదా పాలిప్స్ వచ్చే ప్రమాదం 45% ఎక్కువగా ఉంది. ఈ అడెనోమాలు అనేవి పెద్దపేగు క్యాన్సర్(Colon Cancer) రావడానికి మొదటి హెచ్చరిక సంకేతాలుగా భావిస్తారు.

సీనియర్ పరిశోధకుడు డాక్టర్ ఆండ్రూ చాన్ మాట్లాడుతూ, ప్రజలు అల్ట్రాప్రాసెస్డ్ ఫుడ్స్ ఎంత ఎక్కువగా తింటే, పెద్దపేగు పాలిప్స్ వచ్చే ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. అల్ట్రాప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే చక్కెర, ఉప్పు, కొవ్వు, రసాయనాలు ఎక్కువగా ఉండే రెడీ-టు-ఈట్ (తయారుగా ఉన్న) పదార్థాలు. క్యాన్సర్‌ను అడ్డుకోవాలంటే, ప్రజలు ఈ రకమైన ఆహారాన్ని తినడం తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని ఈ పరిశోధన సూచిస్తోంది.

అల్ట్రాప్రాసెస్డ్ ఆహారాలు మాత్రమే క్యాన్సర్ పెరుగుదలకు కారణం కాదని, జీవక్రియ సమస్యలు, జన్యువులు, జీవనశైలి వంటి ఇతర అంశాలు కూడా ఈ ప్రమాదాన్ని పెంచుతాయని పరిశోధకులు చెప్పారు. అమెరికాలో, పెద్దపేగు క్యాన్సర్(Colon Cancer) అనేది మూడవ అత్యంత సాధారణ క్యాన్సర్‌గా అలాగే క్యాన్సర్ మరణాలకు రెండవ ముఖ్య కారణంగా ఉంది. 2025 నాటికి 1 లక్ష 54 వేల కొత్త కేసులు, 52 వేల 900 మరణాలు సంభవించే అవకాశం కూడా ఉంది.