శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా రూ.100 కోట్ల ఆస్తులు జప్తు

శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా రూ.100 కోట్ల ఆస్తులు జప్తు

శిల్పాశెట్టి మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈసారి ఆమెతోపాటు.. ఆమె భర్త రాజ్ కుంద్రాకు చెందిన దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్.. ఈడీ జప్తు చేసింది. ఈడీ జప్తు చేసిన ఆస్తుల్లో.. ముంబై సిటీ జూహూ ఏరియాలో శిల్పాశెట్టి పేరుతో ఉన్న అపార్ట్ మెంట్ ఫ్లాట్, అదే విధంగా పూణెలో శిల్పాశెట్టి పేరుతో ఉన్న బంగ్లా ఉన్నాయి. రాజ్ కుంద్రా పేరుతో ఉన్న ఈక్విటీ షేర్లను సైతం సీజ్ చేసింది ఈడీ. శిల్పాశెట్టి ఆస్తుల జప్తు.. ముంబై సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

 వేరియబుల్ టెక్ pte.ltd వ్యవస్థాపకుడు దివంగత అమిత్ భరద్వాజ్, అజయ్ భరద్వాజ్, వివేక్ భరద్వాజ్, సింపీ భరద్వాజ్, మహేందర్ భరద్వాజ్ లతో సహా ఎంఎల్ఎం ఏజెంట్లపై మహారాష్ట్ర పోలీసులు ఎన్నో కేసులు ఫైల్ చేశారు.  ఇప్పుడు పెట్టుబడి పెట్టండి బిట్ కాయిన్ రూపంలో నెలకు 10 శాతం రిటర్న్ ఇస్తామని 2017లో రూ. 6 వేల 600 కోట్లు వసూల్ చేసి ప్రజలను మోసం చేసినందుకు గాను కేసులు నమోదయ్యయి. ఎఫ్ఐఆర్ ల ఆధారంగా ఈడీకి కేసును అప్పగించారు. కొన్నేండ్లుగా ఈడీ ఈ కేసుపై దర్యాప్తు చేస్తుంది.

అమిత్ భరద్వాజ్ నుండి రాజ్ కుంద్రా 285 బిట్‌కాయిన్‌లను అందుకున్నట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. మరికొన్ని ఆస్తుల రూపంలో ఉన్నట్టు ఈడీ వెల్లడించింది.  మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 నిబంధనల ప్రకారం రిపు సుదన్ కుంద్రా (రాజ్ కుంద్రా)కు చెందిన రూ. 97.79 కోట్లు అటాచ్  చేస్తున్నట్టు ఈడీ తెలిపింది. ఇందులో రాజ్ కుంద్రా భార్య శిల్పా శెట్టి పేరు మీద ఉన్న రెసిడెన్షియల్ ఫ్లాట్ కూడా ఉంది.  పూణేలో ఉన్న రెసిడెన్షియల్ బంగ్లాను అటాచ్ చేస్తున్నట్టు ఈడీ వెల్లడించింది. దీంతో శిల్పా శెట్టికి ఈడీ నోటీసులు ఇచ్చింది. 
 
ఈ కేసులో 2023, డిసెంబర్ 17 న సింపీ భరద్వాజ్,  డిసెంబర్ 29 న నితిన్ గౌర్ మరియు 16 జనవరి 2023న నిఖిల్ మహాజన్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరంతా ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ప్రధాన నిందితులు అజయ్ భరద్వాజ్, మహేంద్ర భరద్వాజ్ ఇంకా పరారీలో ఉన్నారు. గతంలో ఈడీ రూ.69 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది.