- రూ.2600 కోట్ల మసాలా బాండ్ కేసు
- పెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు
- మాజీ మంత్రి ఐజాక్, కేఐఐఎఫ్‌బీ సీఈవోకూ సమన్లు
తిరువనంతపురం:కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. సీఎంతోపాటు మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్, కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ బోర్డు సీఈవో కేఎం అబ్రహంకు కూడా ఈడీ నోటీసులు పంపింది. 2019లో మాసాలా బాండ్ల జారీతో సేకరించిన నిధులలో రూ.466 కోట్లను అక్రమంగా మళ్లించారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో నోటీసులు జారీ చేసింది. అయితే, విచారణకు సీఎం పినరయి వ్యక్తిగతంగా హాజరుకావాల్సిన అవసరం లేదని నోటీసులలో పేర్కొంది.
దేశంలోనే ఫస్ట్ టైం మసాలా బాండ్ల జారీ
విదేశీ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సేకరించేందుకు 2019లో దేశంలో తొలిసారిగా కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ బోర్డ్(కేఐఐఎఫ్‌బీ) మసాలా బాండ్లను జారీచేసింది. వీటిని లండన్, సింగపూర్ స్టాక్‌ఎక్సేంజీలో లిస్ట్ చేసి రూ.2,673 కోట్ల ఫండ్స్‌ను సమీకరించింది. ఈ నిధుల్లో రూ.467 కోట్లను భూమి కొనుగోలుకు వినియోగించారని ఈడీ ఆరోపిస్తోంది. అది ఫెమా, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధమంటూ కేసు నమోదు చేసింది.
ఎన్నికలప్పుడు ఇలాంటి పనులుబీజేపీకి అలవాటే: సీపీఐ
ఎన్నికలకు ముందు ఇలాంటి రాజకీయాలు చేయడం బీజేపీకి కొత్తేంకాదని సీపీఐ నాయకులు మండిపడ్డారు. 2020 స్థానికల ఎన్నికలు, 2021 అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికలప్పుడు కూడా ఇదే కేసు పేరుతో ఈడీ నోటీసులు వచ్చాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గోవిందన్ గుర్తుచేశారు. కేఐఐఎఫ్‌బీ ద్వారా రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు జరిగాయన్నారు. మాజీ మంత్రి థామస్ మాట్లాడుతూ, ఇది పూర్తిగా రాజకీయ కుట్రేనని అన్నారు. మసాలా బాండ్లకు ఆర్బీఐ అనుమతి తీసుకున్నామని గుర్తుచేశారు. ఎక్కడా భూమి కొనలేదని, అభివృద్ధి పనులకోసం సేకరించామని చెప్పారు. దానికి కూడా ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చిందని పేర్కొన్నారు.
