
శివ్వంపేట, వెలుగు: మెదక్ జిల్లా శివ్వంపేట మండలం రత్నాపూర్ అంగన్ వాడీ సెంటర్లో సుందెలుక పడిన నీళ్లు తాగిన పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అంగన్ వాడీ సెంటర్లోని బిందెలో శనివారం సుందెలుక పడి చనిపోగా, ఈ విషయాన్ని గమనించకుండా ఆ బిందెలో నీళ్లు తాగిన 8 మంది పిల్లలు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.
వారిని నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, రాత్రి వరకు అబ్జర్వేషన్లో ఉంచిన డాక్టర్లు సాయంత్రం ఇండ్లకు పంపించారు. కాగా, రాత్రి కొంత మంది పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొందరికి వాంతులు కాగా, మరి కొందరికి పొట్ట బాగా ఉబ్బింది. దీంతో ఆందోళనకు గురైన తల్లి దండ్రులు వారిని మళ్లీ ఆసుపత్రికి తరలించారు.