ఓటరు స్లిప్స్‌‌ పంపిణీలో పొరపాట్లు లేకుండా చూడాలి : అబ్జర్వర్ రవి

ఓటరు స్లిప్స్‌‌ పంపిణీలో పొరపాట్లు లేకుండా చూడాలి :  అబ్జర్వర్ రవి
  • ఎలక్షన్ జనరల్ అబ్జర్వర్ రవి 

సూర్యాపేట, వెలుగు: పంచాయతీ ఎన్నికలు నిష్పక్షపాతంగా, శాంతియుత వాతావరణంలో జరపాలని జనరల్ అబ్జర్వర్ రవి అన్నారు. గురువారం కలెక్టరేట్‌‌ వీసీ ఛాంబర్ లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ కే. నరసింహతో కలిసి ఆయన గ్రామ పంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు.  ఓటర్లకు అవగాహన కల్పించి తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా  చూడాలని సూచించారు. 

ఓటర్ స్లిప్స్ పంపిణీలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  ఎన్నికల పై వచ్చిన ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలో నిజ నిర్దారణ చేసిన తర్వాతనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉద్యోగులు ఎన్నికల్లో అభ్యర్థులకు మద్దతు తెలిపినా ప్రచారంలో పాల్గొన్న ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటామన్నారు.  

పకడ్బందీగా ఎన్నికల ఏర్పాట్లు

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. మొదటి విడతలో 159 గ్రామ పంచాయతీ లకు,1442 వార్డులకు, రెండవ విడతలో 181 గ్రామ పంచాయతీలకు, 1628 వార్డులకు అలాగే మూడవ విడతలో 146 గ్రామ పంచాయతీ లకు, 1318 వార్డ్ లకు ఎన్నికలు జరుగుతున్నాయని మొత్తం ఓటర్లు 6,94,815 మంది ఉన్నారని వివరించారు. 

సమస్యత్మాక ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అభ్యర్థుల ఖర్చులు లెక్కించేందుకు 23 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 4 స్టాటిక్ టీములు నిరంతరం పర్యవేక్షణ చేస్తాయని, ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధమైన చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.  ఎన్నికల సంబంధిత ఫిర్యాదులు, సూచనలు స్వీకరించి చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. 

ఎన్నికలు ముగిసే వరకు పటిష్ట పోలీసు బందోస్తు 

పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీసు శాఖ నామినేషన్ కేంద్రాల వద్ద, పోలింగ్ కేంద్రాలలో భద్రత కోసం బలగాలను ఏర్పాటు చేశామని ఎస్పీ కే. నరసింహ అన్నారు. కలెక్టరేట్‌‌లో జరిగిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ..  ఎన్నికలు జరిగే రోజు ఎన్నికల సామాగ్రి పంపిణీ నుంచి ఓట్లు లెక్కింపు పూర్తి వరకు ఐదు దశలలో బందోబస్త్ ఏర్పాటు చేశామని గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకున్నామని వివరించారు.

సోషల్ మీడియా, గ్రీవెన్స్ సెల్  ప్రారంభం

సోషల్ మీడియాలో రాజకీయ ప్రచారం, అసత్య ప్రచారం, ద్వేషపూరిత పోస్టులు, ఓటర్లను ప్రభావితం చేసే సందేశాలు, ఉద్రిక్తతలను రేకెత్తించే వ్యాఖ్యలు నిషేధం విధించామన్నారు. వీటిపై జాగ్రత్తగా పర్యవేక్షించాలని సూచించారుఎన్నికల నియమావళి ఉల్లంఘనలు వంటి అంశాలపై వెంటనే 6281492368 కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ కే.  సీతారామారావు, డీఎస్పీ  రవీందర్ రెడ్డి, జడ్పీ సీఈఓ వీవీ అప్పారావు, డీపీఓ యాదగిరి, డీఎల్పిఓలు నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.