ఎంబీఎస్ జ్యువెలర్స్ కు చెందిన 363కోట్ల ఆస్తులు జప్తు

ఎంబీఎస్ జ్యువెలర్స్ కు చెందిన 363కోట్ల ఆస్తులు జప్తు

హైదరాబాద్: ప్రముఖ నగల వ్యాపార సంస్థ ఎంబీఎస్ జ్యువెలర్స్ కు చెందిన రూ. 363 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం తాత్కాలికంగా జప్తు చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎంఎంటీసీని మోసం చేసిన కేసులో ఎంబీఎస్ కు చెందిన 45 ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అలాగే ఎంబీఎస్ ఇంపెక్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆస్తులతో పాటు ఆ కంపెనీల డైరెక్టర్లు సుఖేష్‌గుప్తా, అనురాగ్‌గుప్తా, నీతూగుప్తా, వందనగుప్తాకు చెందిన ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. 
ఫారెక్స్ హామీ లేకుండా, సరైన సెక్యూరిటీ లేకుండా ఎంఎంటీసీ నుంచి బంగారం కొనుగోళ్లు జరిపి రూ.504 కోట్ల ప్రజల సొమ్మును కొట్టేసిందని ఈడీ అభియోగం మోపింది. అంతేకాదు ఎంఎంటీసీకి రూ. 277 కోట్ల నష్టం కల్గించిందని ఈడీ ఆరోపిస్తూ ఈనెల 26వ తేదీన ఈడీ కేసు నమోదు చేసింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎంబీఎస్‌ జువెలర్స్ కు 222 కోట్ల రూపాయలు జరిమానాను విధించింది. 2014లోనే ఈ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేయగా.. ఈ మొత్తం అవకతవకల్లో కొందరు ఎంఎంటీసీ అధికారులు కూడా కుమ్మక్కయ్యారని ఈడీ ఆరోపించింది.