టీ20 వరల్డ్ కప్‌కు మాస్టర్ ప్లాన్: ఇంగ్లాండ్ సలహాదారుడిగా విండీస్ వీరుడు

టీ20 వరల్డ్ కప్‌కు మాస్టర్ ప్లాన్: ఇంగ్లాండ్ సలహాదారుడిగా విండీస్ వీరుడు

డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచ క్ప కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు మొదలు పెడుతుంది. ఇందులో భాగంగా విండీస్ మాజీ స్టార్ ప్లేయర్ కీరన్ పోలార్డ్ ను వచ్చే ఏడాది కరీబియన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ కోసం ఇంగ్లండ్‌ కన్సల్టెంట్‌ కోచ్‌గా తీసుకోనున్నట్లు తెలుస్తుంది. T20 చరిత్రలో పోలార్డ్ అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటివరకు పొట్టి ఫార్మాట్‌లో మొత్తం 637 మ్యాచ్‌లు ఆడిన పోలార్డ్ ఇంగ్లాండ్ జట్టుకు సలహాదారుడిగా ఉంటే వరుసగా రెండోసారి టైటిల్ ఎగరేసుకుపోవడం గ్యారంటీ అంటున్నారు. 

2024 జూన్ వేదికగా వెస్టిండీస్ లోనే టీ20 వరల్డ్ కప్ జరగనుంది. పొలార్డ్ కు కరేబియన్‌లోని పరిస్థితులపై మంచి అవగాహన ఉంది. ఈ నేపథ్యంలో పోలార్డ్ ఇంగ్లాండ్ జట్టుతో పాటు ఉంటే బాగుంటుందని భావిస్తోందట. 36 ఏళ్ళ ఈ ఆజానుబాహుడు గత సంవత్సరం అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. 2012 టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ఈ విధ్వంసకర వీరుడు సభ్యుడిగా ఉన్నాడు. ఇక ఐపీఎల్ లో ముంబై తరపున ఆడిన పొలార్డ్.. పలుమార్లు టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు.
      
ది టెలిగ్రాఫ్ ప్రకారం.. పొలార్డ్  జూన్ ప్రారంభంలో ప్రారంభం కానున్న మెగా టోర్నమెంట్ సమయంలో జట్టులో భాగమవుతాడని తెలిపింది. ప్రస్తుతం  MI న్యూయార్క్, MI ఎమిరేట్స్ జట్ల తరపున ఆడుతున్న ఈ విండీస్ వీరుడు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ గా పని చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా విండీస్ చేతిలో ఇంగ్లాండ్ 5 టీ 20ల సిరీస్ ను 2-3 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే.