మద్యం పంచలేదు,డబ్బులిచ్చి ఓట్లు కొనలేదు

మద్యం పంచలేదు,డబ్బులిచ్చి ఓట్లు కొనలేదు

తనకు తెలియకుండా ఏవైనా జరిగాయేమో కానీ.. ఇన్నేళ్లలో నేను తెలిసి ఏనాడు తప్పు చేయలేదని తెలిపారు  బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్. ఒక్క కరోనా సమయంలో తప్ప ఏనాడు నేను నియోజకవర్గ ప్రజలకు దూరంగా లేనన్నారు. వరంగల్ అర్బన్ కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామస్థులనుద్దేశించి మాట్లాడారు ఈటల.
ప్రజలు కరోనాతో జనమంతా చనిపోతుంటే.. వైద్య ఆరోగ్య మంత్రిగా నా విధుల్లో అక్కడ ఉండాల్సి వచ్చిందని చెప్పారు. 2014 ముందు అభివృద్ధి పనుల కోసం ప్రజలు నన్ను అడగలేదన్నారు. కేవలం తెలంగాణ కోసం కొట్లాడమని నాకు ధైర్యం చెప్పారన్నారు. ఈ నియోజకవర్గంలో నేను మంత్రయ్యాక అనేక రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించాం.. స్కూళ్లు కట్టించుకోవడంతో పాటు చెక్ డ్యాంలు నిర్మించుకున్నామని తెలిపారు.
నీకు కేసీఆర్ అన్యాయం చేసాడని అన్ని పార్టీల వారు, అన్ని వర్గాల ప్రజలు చెబుతున్నారు..నిన్ను వాడుకుని కళ్లలో మట్టికొట్టాడని చెబుతున్నారు అని అంటున్నారని చెప్పిన ఈటల..ప్రజలు నిండు మనస్సుతో ఆశీర్వదిస్తామని చెబుతున్నారన్నారు. అధికార పార్టీ ఏమిచ్చినా తీసుకుంటామని.. ఓటు మాత్రం నీకే వేస్తామంటున్నారని చెప్పారు. 
మేము ఎక్కడ పర్యటిస్తే అక్కడ కరెంట్ తీసేస్తున్నారు..వంగపల్లిలో రాత్రి కరెంట్ తీసేశారని తెలిపారు ఈటల. తెలంగాణ కోసం కొట్లాడిన్నాడు .. రైళ్లు ఆపినా నాడు కూడా మనల్ని ఇబ్బందులు పెట్టలేదన్నారు. కానీ ఇప్పుడు అడగడుగునా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛ లేదు, గౌరవం లేదు. పై పెచ్చు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇట్లాంటి చిల్లర వేషాలు ప్రజలు సహించబోరన్నారు. వాళ్ల అహంకారాన్ని ఓడగొట్టే శక్తి కేవలం హుజురాబాద్ ప్రజలకు మాత్రమే ఉందన్నారు. 
మద్యం, డబ్బులతో గెలవాలని, ఈటల బొండిగె పిసకాలని చూసే కేసీఆర్ అహంకారాన్ని గెలిపిస్తారా? మీ గొంతుకగా మారే ఈటలను గెలిపిస్తారా? అని ప్రజలను ప్రశ్నించారు. ఎప్పుడు మద్యం పంచలేదు.. డబ్బులిచ్చి ఓట్లు కొనలేదన్న ఈటల..ఏనాడు మిమ్మల్ని ఇంతగా ఓటుకోసం నేను అడగలేదన్నారు.