ఎయిర్‍పోర్ట్ అథారిటీకి.. మామునూరు భూములు

ఎయిర్‍పోర్ట్ అథారిటీకి.. మామునూరు భూములు
  • డిసెంబర్​ 27న  భూములు అప్పగించనున్న రాష్ట్ర ప్రభుత్వం   
  • రైతుల అంగీకారంతో ముగిసిన భూసేకరణ ప్రక్రియ

వరంగల్‍, వెలుగు: వరంగల్‍ మామునూర్‍ ఎయిర్‍పోర్ట్  పునర్నిర్మాణంలో నేడు కీలకమైన అడుగుపడుతోంది. ఎయిర్‍పోర్ట్  నిర్మించేందుకు అవసరమైన భూములను రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా అధికారులు నేడు ఎయిర్​పోర్ట్  అథారిటీ ఆఫ్‍ ఇండియా(ఏఏఐ) ఆఫీసర్లకు అందించనున్నారు. వరంగల్‍ కలెక్టర్‍ సత్యశారద ఆధ్వర్యంలో ఆర్‍అండ్‍బీ అధికారులు అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఆ తరువాత ఏఏఐ భూముల హద్దుల్లో కాంపౌండ్​ ఏర్పాటు చేసి పనులు ప్రారంభించనుంది. ఓరుగల్లు వాసుల 45 ఏండ్ల ఎయిర్‍పోర్ట్  కల త్వరలో సాకారం కానుంది.

లీడర్లు, ఆఫీసర్ల చొరవతో..

ఓరుగల్లులో ఏండ్లుగా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలకు ఎన్నికల హామీగా మారిన మామునూర్ ఎయిర్ పోర్ట్ పున:ప్రారంభించే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్​గా తీసుకుంది. ఏండ్ల తరబడి ఉన్న అడ్డంకులను ఒక్కొక్కటిగా క్లియర్‍ చేసింది. విమానాశ్రయానికి 949.14 ఎకరాల భూములు అవసరమని అధికారులు తేల్చగా, 696.14 ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. 253 ఎకరాలు(220 ఎకరాల సాగు భూమి, 33 ఎకరాల ఖాళీ స్థలాలు, ప్లాట్లు) సేకరించాల్సి వచ్చింది. మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కేఆర్‍.నాగరాజు, రేవూరి ప్రకాశ్‍రెడ్డి, నాయిని రాజేందర్‍రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. పలుమార్లు రైతులతో సమావేశం ఏర్పాటు చేసి వారి డిమాండ్లను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. కలెక్టర్‍ సత్యశారద ఈ ప్రాజెక్టుపై స్పెషల్‍ ఫోకస్‍ పెట్టారు. పదులసార్లు బాధిత రైతులు, ప్లాట్ల యజమానులతో సమావేశమై వారి సమస్యలను ఒక్కొక్కటిగా నెరవేర్చి ఏడాదిలో భూసేకరణ పూర్తి చేసి ఏఏఐ అధికారులకు భూములు అప్పగించే ముహూర్తం ఖరారు చేశారు. 

ఎకరానికి రూ.1.20 కోట్ల పరిహారం..

ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణ వచ్చాక కూడా ఏ ప్రాజెక్టులో కూడా ఇలాంటి తరహాలో శాంతియుతంగా భూసేకరణ జరగలేదు. రైతులకు గౌరవప్రదమైన పరిహారం ఇవ్వడం ద్వారా మాత్రమే ఓరుగల్లువాసుల కలను సాకారం చేయవచ్చని ప్రభుత్వం భావించి ముందుకెళ్లింది. మొదట్లో ఒక్కో ఎకరానికి రూ.30 లక్షల పరిహారం ఇస్తామని చెప్పింది. ఆ తర్వాత పలుమార్లు చర్చలు జరగడంతో రూ.80 నుంచి 90 లక్షలకు చేరింది. ఈ క్రమంలో  రైతులకు పరిహారం అందించేందుకు రాష్ట్ర సర్కారు గత ఏడాది నవంబర్ 17న రూ.205 కోట్ల నిధులు కేటాయించింది. అయినా రైతులు సంతృప్తిగా లేకపోవడంతో ఒక్కో ఎకరానికి రూ.1.20 కోట్లకు పరిహారం పెంచింది. దీంతో పెరిగిన బడ్జెట్‍ రూ.90 కోట్లను సైతం అక్టోబర్‍ 17న విడుదల చేసింది.  సానుకూల వాతావరణంలో మామునూర్‍ ఎయిర్‍పోర్ట్  భూసేకరణ క్లియర్‍ అయింది.

భూములను ఏఏఐకి అప్పగిస్తాం..

రాష్ట్ర ప్రభుత్వం మామునూర్ ఎయిర్​పోర్ట్  పునర్నిర్మాణం విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంది. రైతులు సంతోషంగా భూములు ఇచ్చేలా చూడాలని ఆదేశించింది. మొదటి నుంచి ఆఫీసర్లతో కలిసి రైతులకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచాం. సీఎం రేవంత్‍రెడ్డి రైతుల భూములకు ఎకరానికి రూ.1.20 కోట్ల చొప్పున పరిహారం ఇవ్వాలని చెప్పి రూ.295 కోట్లు రిలీజ్​ చేయడంతో భూసేకరణ సాఫీగా జరిగింది. నేడు ఎయిర్‍పోర్ట్  అథారిటీ ఆఫ్‍ ఇండియాకు భూములు అప్పగిస్తాం.

– డాక్టర్  సత్యశారద, కలెక్టర్ -