పాలవాగు తోడేస్తున్నరు

పాలవాగు తోడేస్తున్నరు
  • 10 కిలోమీటర్ల పొడవునా అటవీ ప్రాంతాల్లోనూ తవ్వకాలు
  • ప్రజాప్రతినిధులు, లీడర్ల  కనుసన్నల్లోనే రవాణా

మందమర్రి, వెలుగు:మంచిర్యాల జిల్లాలోని  మందమర్రి మండల పరిధిలో ప్రవహించే పాలవాగులో కిలోమీటర్ల పొడవున ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇసుక, మట్టి అక్రమ రవాణా విషయంలో అక్రమార్కులు బరి తెగిస్తున్నారు. రెవెన్యూ,  అటవీ, భూగర్భ గనుల శాఖ ఆఫీసర్ల ఉదాసీనతే ఆసరాగా అక్రమ దందాను ఇంతకింతకు పెంచేస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా యథేచ్ఛగా తవ్వుతూ ఇసుక, మట్టిని  లూటీ చేస్తున్నారు.  నిత్యం లక్షల రూపాయల విలువ చేసే ఇసుక, మట్టి పట్టణ ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.  మందమర్రి మండల పరిధిలోని శంకర్​పల్లి, సారంగపల్లి, బొక్కలగుట్ట పంచాయతీల మీదుగా మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో సుమారు 10 కిలోమీటర్ల  పొడవునా పాలవాగు పారుతోంది. మందమర్రి మండలం శంకర్​పల్లి పంచాయతీలోని శంకర్​పల్లి, సండ్రోనిపల్లి పరిధిలోని పంట చేన్లు, అటవీ ప్రాంతాలను ఆనుకొని ఎక్కువ దూరం ఉంటుంది. వాగులో లభించే ఇసుక మంచి క్వాలిటీ ఉండటంతో  మందమర్రి, బెల్లంపల్లి, రామకృష్ణాపూర్, కాసిపేట, దేవాపూర్​తదితర ప్రాంతాలవాసులు నిర్మాణాలకు దీన్నే వాడుతున్నారు. దీంతో ఇసుక అక్రమార్కులు, గ్రామాల్లో ట్రాక్టర్లు ఉన్న అత్యధికులు ఏడాది పొడవునా వాగులోని ఇసుక, మట్టిని తరలిస్తూ కాసులు దండుకుంటున్నారు. శంకర్​పల్లి, బొక్కలగుట్ట(కోటేశ్వర్​రావుపల్లి), పులిమడుగు గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు పలువురు, మందమర్రి, క్యాతన్​పల్లి మున్సిపాలిటీల్లోని బ్రిక్స్​ తయారీ దారులు, లీడర్లు ఇసుక తరలింపులో  కీలకంగా వ్యవహరిస్తున్నారు.  ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకొని ఇసుక ట్రిప్పునకు రూ.4 వేల నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తున్నారు. వాగు సమీపంలో పెద్ద సంఖ్యలో బ్రిక్స్​ కంపెనీలు ఏర్పడ్డాయి. 

వాగులో జేబీసీలతో తవ్వకాలు

శంకర్ పల్లి పంచాయతీ శివారులో మందమర్రి, బెల్లంపల్లి మండలవాసులు రాకపోకలు సాగించే మార్గంలోని పాలవాగులో ఇసుక తవ్వకాల కోసం జేసీబీలను వాడుతున్నారు. గ్రామస్థాయి ప్రజాప్రతినిధి ఒకరు మందమర్రి వ్యాపారికి చెందిన  జేసీబీ సాయంతో వాగులో భారీగా ఇసుక తవ్వకాలు చేస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వాగు అటవీ, పంట చేన్ల సమీపంలో ఉండడంతో సంబంధిత ఆఫీసర్లు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. వాగు మధ్యలోనే  సుమారు 15 నుంచి 25 అడుగుల లోతు వరకు ఇసుక తోడుతున్నారు. మందమర్రి పట్టణ శివారు కేకే5 గని వెనుక వైపు గల నీలగిరి తోటల ప్రాంతం, పంటచేన్ల మధ్య వాగులో కూడా పెద్దఎత్తున ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. వాగు పక్కన గల పంటచేన్లలో ఉన్న ఇసుక, మట్టిని కూడా అక్రమార్కులు వాగు పరిధిలోకి వస్తుందని రైతులను  బెదిరిస్తూ తరలిస్తున్నారు. శంకర్​పల్లి నుంచి మండల కేంద్రానికి ట్రాక్టర్లలో నిత్యం ఇసుక, మట్టి రవాణా చేయడంతో రోడ్డంతా అధ్వానంగా మారింది. 

అటవీ ప్రాంతంలో భారీ తవ్వకాలు


మందమర్రి మున్సిపాలిటీ పరిధి పాకిస్థాన్​క్యాంపు(కాళీనగర్​), ఆర్కే1ఏ మైన్​మధ్య గల అటవీ ప్రాంతాలగుండా పాలవాగు పారుతుంది. వాగు ఒడ్డున భారీగా ఇసుక, మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. నిత్యం వందల ట్రాక్టర్ల ఇసుక, మట్టిని ఇక్కడి నుంచి పట్టణాలకు  తరలిస్తున్నారు. సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో తవ్వకాలు జరపడంతో ఈ ప్రాంతం  సింగరేణి ఒపెన్​కాస్ట్​ను తలపిస్తోంది. సుభాశ్​నగర్, కోటేశ్వర్​రావుపల్లి శివారులోని వాగు ప్రాంతాల్లోనూ ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. రైతులకు సంబంధించిన పొలాలతో పాటు ఆనుకుని ఉన్న వాగుల్లో, అటవీ ప్రాంతాల్లో ఇసుక, మట్టి తవ్వేందుకు ఎలాంటి పర్మిషన్లు లేవని సంబంధిత ఆఫీసర్లు పేర్కొంటున్నారు.