రిజర్వ్ ఫారెస్టులో సాతి భవాని జాతర నిషేధం

రిజర్వ్ ఫారెస్టులో  సాతి భవాని జాతర నిషేధం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ నోటిఫైడ్​ రిజర్వ్​ ఫారెస్టు చాతకొండ బీట్​పరిధిలోని రేగళ్ల క్రాస్​రోడ్డులో సాతి భవాని పేర మహా జాతర జరుపుతామంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని, అక్కడ జాతర నిషేధం అని  జిల్లా అటవీశాఖాధికారి కిష్టా గౌడ్​ తెలిపారు. పాల్వంచలోని వన విహార్​ భవన్​లో శుక్రవారం  ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఈ నెల 27 నుంచి వచ్చే నెల 2 వరకు రేగళ్ల క్రాస్​ రోడ్డులో సాతి భవాని జాతరంటూ బంజార సంఘాల పేరుతో భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్​ జిల్లాల్లో వాల్​ పోస్టర్లు వేస్తూ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. జాతర జరుపుతామని చెప్తున్న ప్లేస్​ రిజర్వ్​ ఫారెస్టులోనిదని, ఆ ప్రాంతం కిన్నెరసాని వన్య ప్రాణుల అభయారణ్యానికి సంబంధించిన ఇకో సెన్సిటీవ్​ జోన్​ పరిధిలోని దట్టమైన అటవీ ప్రదేశమని చెప్పారు.

జాతరకు సంబంధించి ఫారెస్టు, రెవెన్యూ, కేటీపీఎస్, పోలీస్​ శాఖల నుంచి ఎటువంటి పర్మిషన్స్​లేవన్నారు.  జాతర పేర ఎవరైనా ఈ ప్రాంతంలోకి ప్రవేశిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే జాతర పేర ప్రచారం చేసే వారిపై లక్ష్మీదేవిపల్లి పోలీస్​ స్టేషన్​లో కంప్లైంట్​ ఇచ్చామన్నారు.  కాగా, ఇదే విషయమై లక్ష్మీదేవిపల్లి తహసీల్దార్​ జి. శిరీష కూడా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రేగళ్ల గ్రామంలోని చాత కొండ రిజర్వ్​ ఫారెస్ట్​ పరిధిలో శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉన్నాయనే సమాచారంతో సెక్షన్​ 163బీఎన్​ఎస్​ఎస్​ ప్రకారం నిషేధాజ్ఞలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. ఈనెల 24 నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు నిషేదాజ్ఞలు అమలులో ఉంటాయని తెలిపారు.