
ముషీరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని ముషీరాబాద్ డివిజన్ గంగపుత్ర కాలనీకి చెందిన ఓ కుటుంబం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మొత్తం ముగ్గురు సూసైడ్ చేసుకోగా.. మృతుల్లో నాలుగేండ్ల చిన్నారి కూడా ఉందని పోలీసులు తెలిపారు. కర్నూల్ జిల్లా లక్ష్మిపురం గ్రామానికి చెందిన కొప్పుల సాయి కృష్ణ (35), చిత్రకళ (30), కూతురు తేజస్విని(4)తో కలిసి ముషీరాబాద్‌లోని గంగపుత్ర కాలనీలో నివాసం ఉంటున్నారు. బిర్లా ప్లానిటోరియంలో చిత్రకళ కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నది. సాయి కృష్ణ ర్యాపిడో బైక్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చిత్రకళ ఉద్యోగం పోవడంతో 25 రోజులుగా ఇంట్లోనే ఉంటున్నది.
ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున కూతురు తేజస్వినికి ఉరివేసిన దంపతులు.. తర్వాత వారు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ‘‘నా చావుకు బిర్లా ప్లానిటోరియంలో పని చేస్తున్న కొఠారి, గీతా రావు కారణం. తప్పుడు ఆరోపణలు చేసి నన్ను జాబ్ నుంచి తీయించేశారు. అపాయింట్మెంట్ లెటర్, పే స్లిప్ అడిగినా ఇవ్వలేదు. వాళ్లు చేస్తున్న ఫ్రాడ్‌పై నిలదీసినందుకు జాబ్ నుంచి తీయించేశారు’’అని ఇంట్లో గోడపై రాశారు. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉందని వారసిగూడ సీఐ శంకర్ తెలిపారు. డెడ్‌బాడీలను పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్‌కు తరలించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.