పహల్గాం ఉగ్రవాదులను చంపేశాం: ఆపరేషన్ మహాదేవ్‎పై అమిత్ షా కీలక ప్రకటన

పహల్గాం ఉగ్రవాదులను చంపేశాం: ఆపరేషన్ మహాదేవ్‎పై అమిత్ షా కీలక ప్రకటన

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న టెర్రరిస్టులను హతం చేయడానికి భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ మహాదేవ్‎పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఆపరేషన్ మహాదేవ్‎లో భాగంగా పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టామని ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్‎పై లోక్ సభలో రెండో రోజు చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ మహదేవ్‎తో పహల్గాంలో దాడి చేసిన ఉగ్రమూకలపై పగ తీర్చుకున్నామన్నారు. 

కుటుంబ సభ్యుల ముందే అమాయకులను పాశవికంగా కాల్చి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పహల్గాం అటాక్ మాస్టర్ మైండ్.. సులేమాన్‌ అలియాస్‌ హషీమ్‌ మూసాను మన జవాన్లు మట్టుబెట్టారని తెలిపారు. మిగిలిన ఇద్దరు టెర్రరిస్టులు యాసిర్, అబు హమ్జా అని చెప్పారు. పహల్గాం ఉగ్రదాడిలో వాడిన ఆయుధాలే ఎన్ కౌంటర్లో హతమైన టెర్రరిస్టుల దగ్గర దొరికాయని తెలిపారు. 

పుణె, ఛత్తీస్‎గఢ్ ల్యాబుల్లో టెస్టుల చేసిన తర్వాతే అధికారికంగా ప్రకటించామన్నారు. జూలై 22న శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా ఉగ్రవాదుల ఆచూకీ గుర్తించి ఆపరేషన్ మహదేవ్ లాంచ్ చేసినట్లు తెలిపారు. ఆపరేషన్ మహదేవ్ విజయవంతం చేసిన సైనికులు, సీఆర్ పీఎఫ్, జమ్మూ పోలీసులకు అభినందనలు తెలిపారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన వారిని కూడా ఎన్ఐఏ అదుపులోకి తీసుకుందని పేర్కొన్నారు. 

ఉగ్రవాదులు పాక్ నుంచే వచ్చారా అని కాంగ్రెస్ నేత చిదంబరం అడుగున్నారని.. టెర్రరిస్టులు పాకిస్థాన్ నుంచే వచ్చారడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఎన్ కౌంటర్లో చనిపోయిన ఉగ్రవాదుల నుంచి పాకిస్థాన్ లో తయారైన పత్రాలు, చాకెట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అమాయక పౌరులపై దాడి చేస్తే మా ప్రతిస్పందన చాలా గట్టిగా ఉంటుందని హెచ్చరించారు.