భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారని.. రైతు ఆత్మహత్యాయత్నం

భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారని.. రైతు ఆత్మహత్యాయత్నం

సిద్దిపేట, వెలుగు: తన భూమిని ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయడంతో  తీవ్ర మనస్తాపానికి గురైన రైతు తహసీల్దారు ఆఫీసు ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడిగె గ్రామానికి చెందిన రైతు బానోతు అంజయ్య 30 ఏండ్ల క్రితం 6.29 ఎకరాల భూమిని కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్నాడు. ఏండ్లు గడుస్తున్నా అంజయ్య ఆ భూమిని తన పేరిట మార్చుకోలేదు. మూడు సంవత్సరాల క్రితం అంజయ్యకు భూమిని విక్రయించిన వ్యక్తులు తమ భూమిని ఆక్రమించాడని కోర్టులో కేసు వేశారు. కోర్టు విచారణ అనంతరం  అంజయ్యకు అనుకూలంగా తీర్పు వెలువడింది. కోర్టు తీర్పు ప్రకారం అప్పటి తహసీల్దారు మాలతీ 3.14 ఎకరాల భూమిని అంజయ్య పేరిట  రిజిస్ట్రేషన్ చేసి  కొత్త పాస్ బుక్కులను అందించారు. ధరణి పోర్టల్ కారణంగా మిగిలిన భూమి ఆయన పేరిట రిజిస్ట్రేషన్ కాలేదు. మిగిలిన మూడెకరాల పైచిలుకు భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని అంజయ్య తహసీల్దారు ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాడు.

ఈ క్రమంలో తహసీల్దారు ఆఫీసులో పనిచేస్తున్న కొందరు రూ. 3 లక్షలు ఇస్తే భూమిని అంజయ్య పేరిట చేస్తామని చెప్పగా అందుకు ఒప్పుకోలేదు. అదే సమయంలో అంజయ్యకు చెందిన భూమిని స్వరూప అనే మహిళ పేరిట రిజిస్ట్రేషన్ చేశారని తెలియడంతో మంగళవారం  గ్రామస్తులతో కలసి తహసీల్దారు ఆఫీసుకు చేరుకుని ఆందోళనకు దిగాడు. కోర్టు తీర్పు తనకు అనుకూలంగా ఉన్నా మిగిలిన భూమిని ఇతరుల పేరిట ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని తహసీల్దారు భూపతిని నిలదీశాడు. తాను లంచం డబ్బులు ఇవ్వకపోవడంతోనే తన భూమిని వేరొకకరి రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపిస్తూ వెంట తెచ్చుకున్న డీజిల్ ను ఒంటిపై చల్లుకున్నాడు. అక్కడున్నవారు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై మహిపాల్ రెడ్డి అక్కడికి చేరుకుని అంజయ్యకు నచ్చజెప్పారు. ఈ విషయంపై తహసీల్దారు భూపతి మాట్లాడుతూ కోర్టు ఉత్తర్వుల మేరకు అంజయ్య తమకు అప్పీల్ చేసుకుంటే పూర్తి స్థాయిలో విచారించి ఆయనకు రిజిస్ట్రేషన్ చేస్తామని, ఆఫీసులో డబ్బులు అడిగిన విషయం తనకు తెలియదని చెప్పారు.