
- రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
- త్వరలో విత్తన చట్టం తెస్తామని వెల్లడి
- కమిషన్ ఏర్పడి ఏడాది
హైదరాబాద్, వెలుగు: గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఒక ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి కమిషన్ చేపట్టిన చర్యలు, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. కమిషన్ ఏర్పాటుకు ముందు మెజారిటీ రైతులు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.
విత్తనాల అంశాన్ని ప్రధానంగా చూస్తున్నామని వెల్లడించారు. ‘‘విత్తన కంపెనీలు రైతులను తమ గుప్పెట్లో పెట్టుకున్నాయి. ములుగు విత్తనాల సమస్యను దృష్టిలో పెట్టుకుని విత్తన చట్టం అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మరికొన్ని రోజుల్లోనే విత్తన చట్టం అమల్లోకి రానుంది. అలాగే భూ సమస్యలపైనా దృష్టి సారించాం. భూమిహక్కు పత్రాలు లేక చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
సమగ్రమైన భూభారతి చట్టాన్ని అమలు చేసి భూ సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నాం” అని తెలిపారు. మైనర్ నీటి వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రైవేట్ మనీ లెండర్ల చేతుల్లో చిన్న, సన్నకారు రైతులు నష్టపోతున్నారని, ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారని కోదండరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మనీ లెండింగ్ చట్టాన్ని కమిషన్ సూచన మేరకు అమలు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని వివరించారు. ఇక గిరిజన రైతులకు సంబంధించి పోడు భూముల హక్కులు ఉన్నప్పటికీ బ్యాంకు రుణాలు దొరకడం లేదని, ఇటీవలే సంబంధిత శాఖల అధికారులు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి రుణాలు అందజేయాలని సూచించామని తెలిపారు.