
హుస్నాబాద్, సిద్దిపేట రూరల్, సిద్దిపేట టౌన్, సంగారెడ్డి టౌన్, చేర్యాల, వెలుగు: అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 30 వేల పరిహారం ఇవ్వాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. గురువారం బొమ్మ శ్రీరామ్, జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీవో ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. సిద్దిపేట రూరల్ మండల అధ్యక్షుడు మల్లమ్మగారి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ శ్రీనివాస్ రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడగళ్ల వానకు వరి, మామిడి, కూరగాయల రైతులు తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. ఎకరాకు రూ.30 వేల పరిహారంతో పాటు తడిసిన వడ్లను కొనాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీ కౌన్సిలర్లు దొడ్డి శ్రీనివాస్, మ్యాదరబోయిన వేణు, పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ గౌడ్, నేతలు సంపత్, రవీందర్, లక్ష్మణ్, రాంప్రసాద్, రాజేందర్, శ్రీనివాస్, రాజు, సురేశ్ గౌడ్, దుర్గం రాజు, సురేశ్, కనకయ్య, దేవరాజు, నరేశ్, సాగర్ పాల్గొన్నారు.
జేఏసీ ఆధ్వర్యంలో.
చేర్యాల జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్ ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా చేసి తహసీల్దార్‌కు మెమోరాండం ఇచ్చారు. వారు మాట్లాడుతూ మామిడి, వరి, కూరగాయల పంటలు దెబ్బతినడంతో పాటు వందల పూరి గుడిసెలు, ఇండ్లపై కప్పులు ఎగిరిపోయాయని వాపోయారు. రైతాంగానికి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు వానాకాలం నుంచి విత్తనాలు, ఎరువులు 50 శాతం సబ్సిడీపై ఇవ్వవాలని డిమాండ్ చేశారు
కాంగ్రెస్ ఆధ్వర్యంలో..
నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని కోరుతూ సిద్దిపేట జిల్లా ఓబీసీ సెల్ చైర్మన్ డాక్టర్ సూర్య వర్మ, పీసీసీ కిసాన్ కాంగ్రెస్ సమన్వయకర్త నాయిని నర్సింహారెడ్డి గురువారం అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. టీపీసీసీ మైనార్టీ వైస్ చైర్మన్ కలీముద్దీన్ పాల్గొన్నారు
సీపీఎం ఆధ్వర్యంలో
రైతులకు ఎకరాకు రూ. 25 వేలు ఇచ్చి ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కా రాములు డిమాండ్ చేశారు. గురువారం సంగారెడ్డిలో నిర్వహించిన సీపీఎం జిల్లా కమిటీ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. అధికారులు అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలను సేకరించి.. పరిహారం అందేలా చూడాలని కోరారు. మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్, నేతలు మల్లేశం, రాజయ్య, మాణిక్యం, రామచందర్, సాయిలు , నర్సింహారెడ్డి ఉన్నారు.