V6 News

వడ్లు కొనేదెప్పుడు?.. వనపర్తి, సిద్దిపేట జిల్లాలో ఇంకా ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు 

వడ్లు కొనేదెప్పుడు?.. వనపర్తి, సిద్దిపేట జిల్లాలో ఇంకా ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు 
  • ఆరబెట్టేందుకు స్థలాలు లేక రైతుల ఇబ్బందులు 
  • మండుటెండల్లో రోజులతరబడి ఎదురుచూపులు

వనపర్తి/సిద్దిపేట, వెలుగు : వనపర్తి, సిద్దిపేట జిల్లాల్లో యాసంగి సీజన్ వడ్లు సెంటర్లకు వస్తున్నా ఇప్పటికీ  కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. దీంతో ధాన్యం కొనుగోలు కోసం రైతులు నిత్యం మండుటెండలో ఎదురుచూస్తున్నారు. ఇదే అదనుగా దళారులు తక్కువ ధరకు కొనుగోళ్లు చేస్తున్నారు. 

వనపర్తి జిల్లాలో ఇదీ పరిస్థితి.. 

ఈ యాసంగి సీజన్​లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అత్యధికంగా వనపర్తి జిల్లాలో వరి సాగయ్యింది. ఇక్కడ 1.75లక్షల ఎకరాల్లో వరి పంట సాగు కాగా, 3.55లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యాన్ని సివిల్​ సప్లయి ఆఫీసర్లు సేకరించనున్నారు. జిల్లాలో కేఎల్​ఐ కాల్వలతోపాటు భూగర్భ జలాలు కూడా పుష్కలంగా ఉండడంతో ఇక్కడి రైతులు ఏడాదిలో రెండు సీజన్లలో వరి సాగుచేస్తున్నారు.  కాగా,  యాసంగి సీజన్​లో పండించిన వరి పంటను కోసి వడ్లను నిల్వ చేసేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఎక్కువ ప్రాంతాల్లో 20 రోజుల కిందనే  పంట చేతికి వచ్చింది.

 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో ఈ సీజన్​లో 414 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆఫీసర్లు నిర్ణయించారు. కేంద్రాల నుంచి ధాన్యాన్ని రైసు మిల్లులకు తరలించేందుకు ట్రాన్స్​పోర్టుకు సంబంధించి లారీల టెండర్లనూ ఖరారు చేశారు. ఉమ్మడి పాలమూరులోని సమీప జిల్లాలలో ఇప్పటి కే కొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచారు. కానీ వనపర్తిలో మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ఇంకా ఎన్నిరోజులు ఎదురుచూడాలోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

సిద్దిపేట జిల్లాలో.. 

సిద్దిపేట జిల్లాలో 3.36 లక్షల ఎకరాల్లో వరి సాగయింది. 5.50 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా.. జిల్లా వ్యాప్తంగా  421(ఐకెపీ211, పీఎసీఎస్ 202, మెప్మా 6, ఎఫ్‌‌‌‌పీవో 2) కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు ప్రకటించారు. ఇందులో ఇప్పటికే 20 సెంటర్లు ప్రారంభమయ్యాయి. హుస్నాబాద్ డివిజన్ పరిధిలో కొన్ని చోట్ల కేంద్రాలను ప్రారంభించినా కొనుగోళ్లు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. హుస్నాబాద్ మార్కెట్ యార్డు ధాన్యంతో నిండిపోగా, తొగుటలో  మార్కెట్ యార్డులో మక్కలు ఎక్కువగా వస్తుండటంతో  వడ్ల కొనుగోళ్లపై ప్రభావం పడుతోంది.

దీంతో  వేరే ప్రాంతంలో కొనుగోలు కేంద్రం  ఏర్పాటు చేయాలని అధికారులు  స్థలాలు అన్వేషిస్తున్నారు.  కోహెడ మండలం కూరెళ్ల ఐకెపీ కొనుగోలు కేంద్రానికి భారీ ఎత్తున వడ్లు అమ్మకానికి వచ్చాయి. కొనుగోళ్లు జరగడం లేదు. కాగా కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో దళారులు రైతుల పరిస్థితిని ఆసరాగా చేసుకొని తక్కువ ధరకు కొంటున్నారు. ప్రభుత్వం క్వింటాకు రూ.2,390 ధర ప్రకటించింది. కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడం, ఎండలు పెరగడం, అకాల వర్షాల భయానికి రైతులు తక్కువ ధరకే దళారులకు అమ్ముకుంటున్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని దళారులు క్వింటాకు రూ.1,800 చొప్పున కొంటున్నారు.