
తమిళనాడు వెంబగవుండన్‌పుత్తూరు ప్రాంతంలో ఘోరమైన సంఘటన వెలుగు చూసింది. అప్పుల భాధ భరించలేక కన్న కూతుళ్ళనే కిరాతంగా చంపి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ తండ్రి. వివరాలు చూస్తే నామక్కల్ జిల్లాలోని రాసిపురం ప్రాంతానికి చెందిన గోవిందరాజ్ 40 ఏళ్ల ఆటో డ్రైవర్. అతనికి భార్య భారతి (25) వీరికి ప్రితికా శ్రీ (8), రితిక శ్రీ (6), దేవశ్రీ (5) అనే ముగ్గురు కుమార్తెలు అలాగే ఒకటిన్నర ఏళ్ల అనీశ్వరన్ అనే కొడుకు ఉన్నాడు.
8 నెలల క్రితం గోవిందరాజ్ సేలం జిల్లాలోని అత్తూర్‌లోని ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ నుండి లారీ కొనడానికి రూ. 14 లక్షలు అప్పు తీసుకున్నాడని కానీ ఆ డబ్బుతో అతను ఇల్లు కట్టుకున్నాడని చెబుతున్నారు. అలాగే అప్పు తీర్చడానికి కేరళకు కూలీగా కూడా వెళ్ళాడు.
వచ్చిన డబ్బుతో 7 నెలలుగా ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీకి ప్రతినెల రూ.27వేలు కడుతుండగా, గోవిందరాజ్ కొన్ని రోజుల క్రితం కేరళ నుండి సొంత ఉరికి వచ్చాడు. దింతో ప్రతినెల EMI కట్టడంలో అతనికి ఇబ్బందులు మొదలై మానసిక వేదనకు గురవుతుండేవాడని చెబుతున్నారు.
నిన్న రాత్రి పిల్లలు, భార్య భోజనం చేసాక గోవిందరాజ్ భార్య భారతి తన కొడుకుతో కలిసి బెడ్ రూమ్ లో నిద్రపోయింది. గోవిందరాజ్ అతని ముగ్గురు కుమార్తెలు కూడా ఇంటి హాలులో పడుకున్నారు. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు గోవిందరాజ్ నిద్రలేచి భార్య, కొడుకు నిద్రిస్తున్న బెడ్ రూమ్ తలుపుకి లాక్ పెట్టి ఇంట్లో నుంచి కొడవలి తీసుకుని హాలులో నిద్రిస్తున్న ముగ్గురు కూతుళ్లను దారుణంగా నరికి చంపాడు. నిద్రపోతున్న పిల్లలు ఒక్కసారిగా మేల్కొని కేకలు వేశారు. పిల్లల ఏడుపు విని బెడ్ రూమ్ లో ఉన్న భారతి అరుస్తూ బయటకు రావడానికి ప్రయత్నించింది. తలుపు బయటి నుంచి లాక్ ఉండటంతో ఆమె బయటకు రాలేకపోయింది. తరువాత, గోవిందరాజ్ ఇంట్లోని విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
►ALSO READ | భర్త హత్యకు భార్య స్కెచ్ ..సజీవంగా పాతిపెట్టాలని చూస్తుండగా..షాకింగ్ ట్విస్ట్
భారతి అరుపులు విన్న పక్కవారు ముగ్గురు పిల్లలు హత్యకు గురై, విషం తాగి గోవిందరాజ్ చనిపోవడం చూసి షాక్ అయ్యారు. ఈ దారుణ సంఘటన గురించి వెంటనే మంగళపురం పోలీసులకు సమాచారం అందించగా హత్య జరిగిన ఇంటికి ఫోరెన్సిక్ నిపుణులను పిలిపించి ఆధారాలు సేకరించారు. హత్యకు గురైన ముగ్గురు బాలికల మృతదేహాలను, ఆత్మహత్య చేసుకున్న గోవిందరాజ్ మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం నామక్కల్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు.
ఈ సంఘటనపై పోలీసులు నిర్వహించిన దర్యాప్తులో గోవిందరాజ్ ముగ్గురు కుమార్తెలను అప్పుల కారణంగా గొంతు కోసి చంపి, ఆపై విషం తాగి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని తేలింది. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.