వెంకటాపూర్ (రామప్ప)/ గోవిందరావుపేట, వెలుగు: గోవిందరావుపేట మండలంలో కొందరి నిర్లక్ష్యం రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. అగ్ని ప్రమాదంలో 3 ఎకరాల పామాయిల్ తోటతో పాటు 15 ఎకరాల జామాయిల్ తోటలు దగ్ధమయ్యాయి. మండలంలోని రాంనగర్ తండా శివారులో మోహన్ రాథోడ్ 3 ఎకరాల్లో పామాయిల్ తోటను సాగు చేస్తున్నాడు. ఆ తోటకు ఆనుకొని మరో రైతు 15 ఎకరాల్లో జామాయిల్ తోటను పెంచుతున్నాడు. శుక్రవారం ఉదయం తోటలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
రైతులు, కుటుంబ సభ్యులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే చెట్లకు మంటలు వ్యాపించి భారీ నష్టం జరిగింది. పేకాట ఆడుతున్న వారి నిర్లక్ష్యం వల్లే మంటలు వ్యాపించాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై వారు పస్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అగ్ని ప్రమాదంలో సుమారు రూ.8 లక్షల మేర నష్టం జరిగినట్లు బాధిత రైతులు తెలిపారు.
