
- నిరాశ్రయులకు భోజనం, దుప్పట్లు, నిత్యావసరాల పంపిణీ
నిజామాబాద్ : జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఇళ్లలోకి నీరు చేరి వందలాది కుటుంబాలవారు నిరాశ్రయులయ్యారు. కష్టకాలంలో గవర్నమెంట్ ఆఫీసర్లు, స్వచ్ఛంద సంస్థలు, యువకులు, వీడీసీలు, రాజకీయ నాయకులు బాధితులకు సాయమందించి మానవత్వాన్ని చాటారు.
ఆగస్టు 28 నుంచి 31 వరకు వరద బాధితులకు అండగా నిలిచారు. కొందరు భోజనాలను అందజేయగా, మరికొందరు తాగునీరు, చలిలో వణుకుతున్న వారికి దుప్పట్లు అందించారు. ఇండ్లలో బురద చేరి వస్తువులు నిరుపయోగంగా మారడంతో కొందరు రైస్ బ్యాగులు, నిత్యావసర సరుకులు, వంట గ్యాస్ అందజేశారు.
12 మండలాల్లో అత్యధిక ప్రభావం..
భారీ వర్షాలతో కూడిన వరద ప్రభావం సిరికొండ, భీంగల్, ధర్పల్లి, బోధన్, సాలూరా, చందూర్, నవీపేట, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, ఇందల్వాయి, నిజామాబాద్ రూరల్ వంటి 12 మండలాల్లో ఎక్కువగా కనిపించింది. వరద నీరు ఇళ్లను ముంచితే, కట్టుబట్టలతో బయటకు వెళ్లి ప్రాణాలు రక్షించుకున్నారు.
ప్రభుత్వం, స్థానికుల సాయం..
ప్రభుత్వం 7 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, 453 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం పంపిణీ చేసింది. సిరికొండ, ధర్పల్లి మండలాల్లో చెరువుల కట్టలు తెగి వందలాది కుటుంబాలు పంటలు, ఇండ్లు నష్టపోయారు. వాడి, కొండూర్, గడ్గోల్, పెద్దవాల్గొట్, భీంగల్, హోన్నాజీపేట గ్రామాల వారికి ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేశారు.
పక్కనున్న సీతాయిపేట, రాంపూర్, దుబ్బాక గ్రామాల వీడీసీలు, నిజామాబాద్ ఫుడ్ బ్యాంక్ ప్రతినిధులు ప్రతి రోజు వేల మందికి భోజనం అందించారు. రేకులపల్లి, హుస్సేన్‌నగర్, దుబ్బాక, మైలారం, రావుట్ల, పెద్దవాల్గొట్ వీడీసీలు రైస్ బ్యాగులు, నిత్యావసర సరుకులు అందజేశారు. వేములవాడ ధర్మకర్తలు, నర్మల భాస్కర్ రెడ్డి దుప్పట్లు అందించారు.
స్వచ్ఛంద సంఘాల సాయం..
వివిధ పార్టీలకు చెందిన వారు వంట గ్యాస్, అన్నం, నూనె, సబ్బులు, సర్ఫ్ వంటి వస్తువులు అందించారు. బోధన్ లయన్స్ క్లబ్ ప్రతినిధులు, నాయకులు కూడా సాయం చేశారు. వరదలు తగ్గిన తర్వాత సహాయ కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ నేతలు 50 క్వింటాళ్ల రైస్‌ను పంపిణీ చేశారు. వంటలు చేసుకోలేని వాడి ఇతర గ్రామాల్లో ఆహార శిబిరాలు కొనసాగుతున్నాయి. ధర్పల్లి, నిజామాబాద్ నగర పోలీసులు కూడా బాధితులకు అండగా నిలిచారు.