స్లోగా ఫ్లై ఓవర్ల పనులు..  పబ్లిక్ నానా అవస్థలు

V6 Velugu Posted on Oct 14, 2021

హైదరాబాద్, వెలుగు:  జంట నగరాల్లో ట్రాఫిక్​ జామ్​లను తగ్గించేందుకు బల్దియా నిర్మిస్తోన్న ఫ్లై ఓవర్ల పనులు స్లోగా నడుస్తున్నాయి. మెయిన్ ​రోడ్లపై ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్​ జామ్​లు ఎక్కువయ్యాయి. ఆఫీసులకు, వివిధ పనులపై వెళ్లే వాహనదారులు గంటల కొద్దీ ఇబ్బందులు పడుతున్నారు.  సడన్​గా ట్రాఫిక్​ను మళ్లిస్తుండగా ఎప్పుడు ఏ రూట్​లో ట్రాఫిక్​ డైవర్షన్​ఉంటుందో తెలియని అయోమయ పరిస్థితులు ఉన్నాయి. ఫ్లై ఓవర్ల పనుల కోసం రోడ్లను తవ్వి హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడంతో ప్రమాదాలు కామన్​ అయ్యాయి. మరోవైపు రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపుల వ్యాపారులకు బిజినెస్​లు సరిగా నడవడం లేదు. కరోనాతో దెబ్బతిని ఇప్పుడే పుంజుకుంటుండగా ఫ్లై ఓవర్ల పనుల్లో లేట్​ కారణం గా మరింత నష్టపోతున్నామని పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లకు బల్దియా బిల్లులు చెల్లించకపోవడంతోనే పనులు స్పీడ్​గా కొనసాగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. 
ఎనిమిది చోట్ల ఇదే పరిస్థితి
నాగోల్, షేక్​పేట, సంతోష్​నగర్​ ఓవైసీ హాస్పిటల్‌ జంక్షన్, బహదుర్​పురా, ఇందిరా పార్కు, నల్గొండ ఎక్స్ రోడ్, ఉప్పల్–మేడిపల్లి,  బైరామల్​గూడ  ఏరియాల్లో కొత్తగా ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నారు. ఇవన్ని ఈ ఏడాది చివర్లో, వచ్చే ఏడాది మార్చిలోగా కంప్లీట్​చేయాల్సి ఉంది. స్లోగా నడుస్తున్న పనులు చూస్తుంటే మరో ఏడాదిన్నర కాలం పట్టేలా ఉందని అధికారులే అంటున్నారు. కొన్నిచోట్ల ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగకుండా  స్టీల్‌ బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు.  పిల్లర్ల పునాదులు, అప్రోచ్‌లు మాత్రమే కాంక్రీట్​తో నిర్మిస్తారు. మిగతా అన్నీ బయటే తయారు చేసుకుని తీసుకొచ్చి బిగిస్తారు. ఈ పనులు కూడా బహదుర్​పురా, వీఎస్​టీ, ఓవైసీ రూట్​లో స్లో గా నడుస్తుండగా ట్రాఫిక్ సమస్య  ఎక్కువైంది.

 రోడ్లన్నీ అధ్వానంగా..
ఫ్లై ఓవర్ పనులతో  ఇందిరా పార్క్​ నుంచి బాగ్​లింగంపల్లి వరకు బైక్​పై వెళ్తే పది నిమిషాల్లో చేరుకోవాల్సి ఉండగా ఇప్పుడు అరగంట పడుతుంది. బెంగళూరు, కర్నూలు ఇతర జిల్లాలకు వెళ్లాలంటే బహదూర్ పురా రూట్​కీలకం. ఇక్కడ  ఫ్లై ఓవర్ నిర్మాణ పనులతో పురానాపుల్​నుంచి జూపార్క్​ వరకు గంటల పాటు  ట్రాఫిక్​జామ్ అవుతుంది. ఉప్పల్​‌– మేడిపల్లిలో రూట్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. నల్గొండ ఎక్స్​రోడ్​, బైరామల్​గూడ లో కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లై ఓవర్ల పనుల కారణంగా రోడ్లన్నీ అధ్వానంగా మారాయి. దుమ్ము, ధూళితో ముందు వెళ్తున్న వాహనం కనిపించడం లేదని వాహనాదారులు వాపోతున్నారు. సిటీలో ఎంటర్​ అయ్యే ప్రాంతాల్లోనే  ఇలాంటి పరిస్థితి ఉంది. 
రోడ్డున పడ్డ వ్యాపారులు 
సిటీలో ట్రాఫిక్ తగ్గించేందుకు నిర్మిస్తోన్న ఫ్లై ఓవర్ల నిర్మాణ పనుల కారణంగా చాలామంది వ్యాపారులు రోడ్డున పడ్డారు. ఆర్టీసీ క్రాస్​రోడ్, బహదూర్​పురా,  ఓవైసీ జంక్షన్​, నల్గొండ క్రాస్​రోడ్​లో బాటిల్​నెక్​ రోడ్డు కావడంతో  ట్రాఫిక్​ స్లోగా వెళ్తుంది. దీంతో రోడ్లకు ఇరువైపులా వ్యాపారాలు జరగడం లేదు. షాపుల ముందు ఆగడానికి జాగా కూడా లేదు. దీంతో తమ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలకు వేలల్లో కిరాయి కడ్తున్నామని, ఉదయం నుంచి రాత్రి వరకు ఐదు వందలు గిరాకీ కూడ కావడం లేదని వాపోతున్నారు. ఏడాదిన్నర నుంచి కరోనా దెబ్బతో తీవ్రంగా నష్టపోయామని, ఇప్పుడు కుదుట పడ్తున్న సమయంలో ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులతో దెబ్బ పడుతోందని అంటున్నారు. 

కిరాయి కట్టేందుకు అప్పు చేస్తున్నా..
 పదిహేనేండ్లుగా షాపు పెట్టుకొని నెలకు పదివేలు కిరాయి కడ్తున్ననా. ఫ్లై ఓవర్​కడుతుండగా రోడ్డును బ్లాక్​ చేశారు. కరోనాతో ఏడాది కాలంగా నష్టపోయాం. ఇప్పుడిప్పుడే గిరాకి పెరుగుతుండగా  రోడ్డును బ్లాక్​ చేయడంతో బిజినెస్​లు నడవట్లేదు. కిరాయి కట్టేందుకు అప్పులు చేస్తున్నా.              ‑ బాబురావు, ఆర్టీసీ క్రాస్​రోడ్​ 


సడన్​గా ట్రాఫిక్​ డైవర్ట్​ చేయగా.. 
రోజూ ఇందిరాపార్క్​ వద్ద ఓ ఇనిస్టిట్యూట్​లో ఆన్​లైన్​ క్లాసులు చెప్తా. బైక్​పై ఆర్టీసీ క్రాస్​రోడ్ మీదుగా వెళ్తుంటా. సడన్​గా ట్రాఫిక్​ను డ్రైవర్ట్​ చేసి,  బారికేడ్లు పెట్టారు. అటు  ఎక్కడ్నుంచి వెళ్లాలో తెలిపే బోర్డులు కూడా పెట్టలేదు.                                                                                                                  ‑ రవి, దిల్​సుఖ్​నగర్ 


సడన్​గా ట్రాఫిక్​ డైవర్షన్​​  
ఫ్లైఓవర్ల నిర్మాణాలు స్పీడ్​గా సాగట్లేదు. చిన్న కారణాలతో పనులు లేట్​అవుతున్నాయి.  ఆయా రూట్లలో  ప్రయాణించే తిరిగే వారికి ప్రత్యామ్నాయ రూట్​లు చూపకుండానే సడెన్​గా ట్రాఫిక్​ను డైవర్షన్​ చేస్తుండగా, తెలియక వెళ్లే వాహనదారులు ట్రాఫిక్​జామ్​లో ఇరుక్కుంటున్నారు. సిటీ బస్సుల రూట్లు​కూడా మారిపోయాయి. ట్రాఫిక్‌ రద్దీ ఉంటుండగా ఆఫీసర్లు ముందుగానే అలర్ట్​ చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి.   ప్రత్యామ్నాయ రూట్​లో ఏర్పాటు చేయకపోవడం పాటు నిర్మాణ పనులు చేస్తున్న ప్రాంతాల్లో సూచిక బోర్డులు కూడా లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్తున్నారు. 

Tagged Hyderabad, WORKS, Slow, , Flyovers, Public difficulties

Latest Videos

Subscribe Now

More News