- శనివారం ఎస్సీ గురుకులంలో ముగ్గురు విద్యార్థులకు అస్వస్థత
గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలోని మరో హాస్టల్లో వరుసగా రెండో రోజు ఫుడ్ పాయిజన్ జరిగింది. శుక్రవారం రాత్రి ఎర్రవల్లి మండలం ధర్మవరం హాస్టల్లో ఫుడ్ పాయిజన్ తో 54 మంది స్టూడెంట్స్ అస్వస్థకు గురవగా, వారిలో 30 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఆ ఘటన మరువక ముందే ఎర్రవల్లి మండలం ఎస్సీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ తో ముగ్గురు స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారు. ఉదయం ఎస్సీ గురుకులంలో జీరా రైస్ పెట్టారు.
దీనిని తిన్న ఇంటర్ ఫస్టియర్ స్టూడెంట్స్ శీను, అఖిల్, ఇంటర్ సెకండియర్ స్టూడెంట్ భరత్ కడుపునొప్పితో వాంతులు చేసుకున్నారు. వారిని వెంటనే ఇటిక్యాల ఎస్సై రవి గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేదని డాక్టర్లు తెలిపారు. ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురై గద్వాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కలెక్టర్ సంతోష్ పరామర్శించారు.
విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ధర్మవరం హాస్టల్ వార్డెన్ జయరాములు నాయక్ ను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు.
