- ఐఎస్ ఐ మార్క్ లేని సరుకులు
- వంట మనిషి లేక కూలీలతో వంట
- మొగడ్ ధగడ్ ఆశ్రమ పాఠశాలలో అడిషనల్ కలెక్టర్ తనిఖీలు
కాగజ్ నగర్, వెలుగు: స్కూళ్లు, గురుకులాల్లో ఫుడ్పాయిజన్ఘటనల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ గురువారం కౌటాల మండలంలోని మొగడ్ ధగడ్ ఆశ్రమ పాఠశాలలో తనిఖీ చేశారు. అక్కడ విద్యార్థులకు కనీస వసతులు లేకపోవడం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్టోర్ రూంలో ఉన్న ఆలుగడ్డలు కుళ్లిపోయి, బూజు పట్టాయి. ఉప్పు ప్యాకెట్లపై ఐఎస్ఐ మార్క్ లేకపోవడంతో వాటిని రిటర్న్ చేయాలని అడిషనల్ కలెక్టర్ ఆదేశించారు. స్కూల్లో రెగ్యులర్ కుక్ లేకపోవడంతో రోజువారీ కూలీలు వంట చేస్తున్నారు.
మెనూ ప్రకారం పప్పు వండాల్సి ఉండగా సాంబార్ పెట్టారు. ఉడికించిన కొన్ని కోడిగుడ్లు కుళ్లిపోయాయి. పిల్లలకు ఇప్పటివరకు యూనిఫాంలు అందలేదు. రోజురోజుకూ చలి తీవ్రమవుతున్నా ఇప్పటికీ బ్లాంకెట్లు అందలేదు. విద్యార్థులకు సమస్యలు లేకుండా చూసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రతిపాదనలు పంపాలని ఏటీడీవో హుస్సేన్, ఎంపీడీవో ప్రసాద్ ను అడిషనల్కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కౌ టాల పీహెచ్ సీని తనిఖీ చేశారు. టీటీ సహా యాంటీ రేబిస్, యాంటీ వేనమ్ ఇంజెక్షన్లు అందుబాటులో లేకపోవడాన్ని గుర్తించి వెంటనే తెప్పించాలని డాక్టర్ ను ఆదేశించారు.