ఆర్థిక ఇబ్బందులతో మాజీ కౌన్సిలర్ ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో  మాజీ కౌన్సిలర్ ఆత్మహత్య

జమ్మికుంట, వెలుగు: కరీంనగర్  జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ ఏడో వార్డు మాజీ కౌన్సిలర్  పొన్నగంటి సారంగం(45) ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గత బీఆర్ఎస్  ప్రభుత్వ హయాంలో కౌన్సిలర్ గా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచాడు. అనంతరం కాంగ్రెస్ లో చేరి క్రియాశీలక సభ్యుడిగా పని చేస్తూ ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.

ఈక్రమంలో అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక పొలం వద్ద బుధవారం రాత్రి పురుగు మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతడిని వరంగల్  ఆసుపత్రికి తీసుకెళ్లగా, చికిత్స చేస్తుండగా చనిపోయాడు. ఆయన మృతి పట్ల మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, హుజురాబాద్  కాంగ్రెస్  నియోజకవర్గ ఇన్​చార్జి ప్రణవ్ బాబు సంతాపం తెలిపారు.