V6 News

భద్రాచలాన్ని బీఆర్ఎస్ పట్టించుకోలే : మాజీ ఎంఎల్సీ బాలసాని

భద్రాచలాన్ని బీఆర్ఎస్ పట్టించుకోలే : మాజీ ఎంఎల్సీ బాలసాని
  • మాజీ ఎంఎల్సీ బాలసాని

భద్రాచలం, వెలుగు :  అధికార పార్టీకి చెందిన మద్దతుదారులను ఎన్నుకుంటేనే గ్రామాలు అభివృద్ధి పథంలో సాగుతాయని, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నర్పంచ్ అభ్యర్థి పూనెం కృష్ణకు ఓటు వేసి గెలిపిస్తే భద్రాచలం సమగ్రాభివృద్ధి జరుగుతుందని మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ అన్నారు. సోమవారం స్థానిక కేకే ఫంక్షన్ హాల్​లో జరిగిన విలేకరుల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్​ తెల్లం వెంకట్రావుతో కలిసి ఆయన మాట్లాడారు. 

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాముని కల్యాణానికి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు తేలేక పోయారని గుర్తుచేశారు. మొదట్లో రూ.100 కోట్లు తేలేదని, వరదల సమయంలో వచ్చి రూ.1000 కోట్లు ఇస్తానని చెప్పి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత తిరిగి భద్రాచలాన్ని ఒక్క వంచాయితీగానే కొనసాగించేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. ఎమ్మెల్యే తెల్లం మాట్లాడుతూ వ్యక్తిగత దూషణలు, ఆరోపణలకు దిగుతూ రాజకీయ విలువలను దిగజార్చడం తగదన్నారు. 

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకే,  ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకునేందుకు అనునిత్యం కృషి చేస్తానన్నారు. పూనెం కృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బుడగం శ్రీనివాస్, బోగాల శ్రీనివాసరెడ్డి, చింతిర్యాల రవికుమార్, కొండిశెట్టి కృష్ణమూర్తి, భీమవరపు వెంకటరెడ్డి, జిందా తదితరులు పాల్గొన్నారు.