జెన్ జడ్ ఆందోళనకారుల దాడిలో నేపాల్ మాజీ ప్రధాని ఖనాల్ భార్య చనిపోలేదు.. అవన్నీ ఫేక్ వార్తలు..!

జెన్ జడ్ ఆందోళనకారుల దాడిలో నేపాల్ మాజీ ప్రధాని ఖనాల్ భార్య చనిపోలేదు.. అవన్నీ ఫేక్ వార్తలు..!

ఖాట్మండు: దేశంలో సోషల్ మీడియాపై బ్యాన్, ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా నేపాల్‎లో జెన్ జెడ్ యువత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. ఆగ్రహానికి గురైన నిరసనకారులు ప్రధాని, మంత్రులు, అధికార పార్టీ నేతలే లక్ష్యంగా దాడులు చేశారు. దేశ ఆర్థిక శాఖ మంత్రి, విదేశాంగ శాఖ మంత్రులను వీధుల్లో ఉరికించి ఉరికించి కొట్టారు ఆందోళనకారులు. ఈ క్రమంలోనే నేపాల్ మాజీ ప్రధాన మంత్రి ఝాలా నాథ్ ఖనాల్ ఇంటికి నిప్పటించారు.

మంటల్లో కాలి ఝాలా నాథ్ ఖనాల్ భార్య రవి లక్ష్మీ చిత్రాకర్ మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, నిరసనకారుల దాడిలో ఖనాల్ భార్య రవి లక్ష్మీ చిత్రాకర్ మరణించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని ది ఖాట్మండు పోస్ట్ వార్త సంస్థ వెల్లడించింది. ఆమె బతికే ఉందని ధృవీకరించింది. లక్ష్మీ చిత్రాకర్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. 

ఖాట్మండులోని దల్లు ప్రాంతంలో జరిగిన హింసాత్మక ఘర్షణల్లో మాజీ ప్రధాని ఖనాల్ భార్య రవి లక్ష్మి మరణించారని నేపాల్ స్థానిక మీడియా మంగళవారం (సెప్టెంబర్ 7) కథనాలు ప్రచురించింది. నిరసనకారులు ఖనాల్ నివాసానికి నిప్పంటించారని, ఈ ఘటనలో రవి లక్ష్మి లోపల చిక్కుకుని మంటల్లో కాలి చనిపోయినట్లు ప్రచారం జరిగింది. కానీ ఆమె చనిపోలేదు. మంటల్లో తీవ్రంగా గాయపడటంతో ఆమెను కీర్తిపూర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని.. ఐసీయూలో ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. 

యువత ఆందోళనల దెబ్బకు ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దీంతో నేపాల్‎లో తీవ్ర రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దేశంలో లా అండ్ అర్డర్ అదుపు తప్పడంతో ఆర్మీ రంగంలోకి దిగి పరిస్థితులను అదుపులోకి తీసుకుంది. కేపీ శర్మ ఓలీ రాజీనామాతో తాత్కలిక ప్రధాని ఎంపికపై చర్చలు జరుతున్నాయి. పీఎం రేసులో ఖాట్మండు మేయర్ బాలేంద్ర బాలెన్ షా, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి, నేపాల్ విద్యుత్ అథారిటీ మాజీ చీఫ్ కుల్మాన్ ఘిసింగ్ ముందంజలో ఉన్నారు. వీరి ముగ్గురిలోనే ఒకరు నేపాల్ తాత్కలిక ప్రధాని పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.