కంచ గచ్చిబౌలి భూముల్లో వన్యప్రాణులున్నాయా?

కంచ గచ్చిబౌలి భూముల్లో వన్యప్రాణులున్నాయా?
  • తేల్చేందుకు సీసీ కెమెరాలు పెట్టనున్న అటవీ శాఖ 
  • ఉంటే.. సంఖ్య ఎంత, రక్షణకు ఏం చేయాలనే దానిపై సర్కారుకు నివేదిక
  • భూములను పరిశీలించిన ఫారెస్ట్​ ఆఫీసర్లు

హైదరాబాద్, వెలుగు: కంచ గచ్చిబౌలి భూముల్లో వన్యప్రాణులు ఉన్నాయా లేవా అన్నది తేల్చేందుకు అటవీశాఖ రెడీ అయ్యింది. కంచ గచ్చిబౌలి భూముల్లోని వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఫారెస్ట్​ అధికారులు సోమవారం కంచ గచ్చిబౌలి ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ప్రాంతంలో అసలు వన్యప్రాణులున్నాయా? లేవా? ఉంటే ఏయే జంతువులున్నాయి?  వాటి సంరక్షణకు  ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది తేల్చేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ట్రాక్​చేయాలని చూస్తున్నారు. 

కంచ గచ్చిబౌలి భూముల్లో హెచ్​సీయూకు 1600 ఎకరాలు,  ప్రభుత్వానికి దాదాపుగా 400 ఎకరాల భూములున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే అటవీశాఖాధికారులు రెండు సార్లు భూముల వద్దకు వెళ్లి పరిశీలించారు. వైల్డ్ లైఫ్ పీసీసీఎఫ్ (అటవీ సంరక్షణ ప్రధానాధికారి) ఇలూసింగ్ మేరు కూడా కంచ గచ్చిబౌలిలో చెట్లు కొట్టేసిన ప్రాంతాన్ని పరిశీలించారు.  ఈ ప్రాంతంలో  నెమళ్లు , జింకలున్నాయా? ఒకవేళ ఉంటే వాటి సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు త్వరలో రిపోర్ట్​ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

హెచ్​సీయూలో ఇటీవల కుక్కల దాడిలో జింకలు మృతి చెందాయని వార్తలు రాగా, అక్కడి పరిస్థితులను కూడా పరిశీలించారు. జింకలపై కుక్కలు దాడి చేయకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించినట్లు తెలిసింది. ఈ భూములు గడ్డి​,  జలవనరులతో నిండి ఉండడంతో చుట్టుపక్కల ఉండే వన్యప్రాణులు దాహార్తి తీర్చుకోవడానికి వచ్చే అవకాశాలున్నాయని, అంతే తప్పా అవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే పరిస్థితులు లేవని వారు ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వానికి ఫారెస్ట్​ అధికారులు రిపోర్ట్​ ఇచ్చిన తర్వాత పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.