దొంగనోట్ల పేరుతో మోసం

దొంగనోట్ల పేరుతో మోసం
  •     దొంగనోట్ల పేరున బురిడీ కొట్టిస్తున్న ఇద్దరి అరెస్ట్​
  •     30 కట్టల బ్లాక్​ పేపర్స్, అయోడిన్, నిమ్మరసం సీజ్

హనుమకొండ, వెలుగు: రూ.లక్షకు మూడు రెట్ల నకిలీ నోట్లు ఇస్తామని, వాటిని మార్కెట్​లో ఈజీగా మార్చవచ్చంటూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను వరంగల్​సీసీఎస్, మట్వడా పోలీసులు అరెస్ట్​చేశారు. వరంగల్ సీపీ డా. తరుణ్​జోషి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని విశాఖపట్నానికి చెందిన గనిశెట్టి నగేశ్, రాజమండ్రికి చెందిన గొర్రెల మురళీమోహన్​ఇద్దరూ ఫ్రెండ్స్. నగేశ్​ఏసీ మెకానిక్​కాగా మురళీ మోహన్​కార్​డ్రైవర్. ఇద్దరూ జల్సాలకు అలవాటుపడ్డారు. వచ్చే ఆదాయం ఖర్చులకు సరిపోక ఈజీగా మనీ సంపాదించాలని నిర్ణయించుకున్నారు. నోట్ల మార్పిడి పేరుతో మోసానికి తెరలేపారు. ముందస్తు ప్లాన్​ప్రకారం నగేశ్, మురళీమోహన్​అమాయక జనాలను టార్గెట్​చేసుకుని వారితో మాట కలిపేవారు. అనంతరం తమ వద్ద నకిలీ నోట్లు ఉన్నాయని చెప్పేవారు. రూ.లక్ష ఇస్తే అందుకు మూడు రెట్ల విలువైన నకిలీ నోట్లు ఇస్తామని, వాటిని మార్కెట్​లో చెలామణి చేసుకోవచ్చని నమ్మబలికేవారు. ఎవరైనా అందుకు అంగీకరిస్తే రూ.500 నోటుకు సరిపడా సైజులో ఉండే నల్లకాగితాల కట్టలను వారికి ఇచ్చేవారు. ముందస్తు ప్లాన్​ ప్రకారం నాలుగైదు అసలైన రూ.500 నోట్లకు బ్లాక్​కలర్​వేసి అదే నల్ల కాగితాల కట్టలో పెట్టేవారు. ఆ బ్లాక్​నోట్లను అయోడిన్​ టోనర్, నిమ్మరసంలో ముంచితే అసలైన కరెన్సీ కనిపిస్తుందని చెప్పేవారు. వారి ముందే టెస్ట్​ చేస్తున్నట్లు నటించేవారు. బ్లాక్​కలర్​వేసిన ఒరిజినల్​నోట్లను ఆయా లిక్విడ్స్​లో ముంచి జనాలను బోల్తా కొట్టించేవారు. అనంతరం వారికి బ్లాక్​కలర్​పేపర్స్​అంటగట్టి అక్కడి నుంచి ఉడాయించేవారు. రెండు నెలల కింద హైదరాబాద్​ ఫిలింనగర్​సమీపంలోని ఓ బార్​లో వాజేడు మండలం చింతూరుకు చెందిన మేడిచెర్ల మోహన్​ నిందితులిద్దరికి పరిచయం అయ్యాడు. ఆయనతో మాట కలిపిన నగేశ్, మురళీమోహన్​నకిలీ నోట్లు ఉన్నాయని చెప్పారు. వారి మోసాన్ని గ్రహించిన ఆయన వారిని వరంగల్ ఎంజీఎం వద్దకు రమ్మని చెప్పి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. నిందితులిద్దరూ ఎంజీఎం సెంటర్​కు రాగానే సీసీఎస్, మట్వాడా పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి నుంచి ఒక్కో దాంట్లో వంద కాగితాలు ఉండే 30 బ్లాక్​పేపర్​కట్టలు, అయోడిన్​టోనర్, నిమ్మరసం బాటిల్, మూడు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన క్రైమ్స్​అడిషనల్ డీసీపీ పుష్ప, క్రైమ్స్​ఏసీపీ డేవిడ్​రాజ్, సీసీఎస్​ సీఐలు శ్రీనివాసరావు, రమేశ్​కుమార్, మట్వాడా సీఐ రమేశ్​ తదితరులను సీపీ అభినందించారు.