భగ్గుమంటున్న ఫ్రాన్స్.. ఎమెర్జెన్సీ విధింపు

భగ్గుమంటున్న ఫ్రాన్స్.. ఎమెర్జెన్సీ విధింపు

ఫ్రాన్స్లో ఎమెర్జెన్సీని విధించారు. పోలీసుల కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడు మృతి చెందడంతో దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. మూడు రోజులుగా హింసాత్మక ఘటనలతో నిరసనలతో ఫ్రాన్స్​ అట్టుడికిపోతోంది. ఈ నేపథ్యంలో ఫ్రెంచ్ ప్రధాన మంత్రి ఎలిసబెత్ బోర్న్ అత్యవసర పరిస్థితి విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

అధికారులకు ప్రత్యేక అధికారాలు..

ఫ్రాన్స్లో ఆందోళనల నేపథ్యంలో  అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అధ్యక్షతన భద్రతా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రధాని ఎలిసబెత్ బోర్న్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్ లోని పలు ప్రాంతాల్లో స్థానిక పరిస్థితిని బట్టి కర్ఫ్యూలను ప్రకటించే అధికారాన్ని అధికారులకు కల్పించారు. అలాగే అల్లర్లను అదుపు చేయడానికి, ఆందోళనలు చేస్తు్న్న వారిని కట్టడి చేసేందుకు పోలీసులకు మరిన్ని పవర్స్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఫ్రాన్స్ లో ఎమర్జెన్సీ విధించిన నేపథ్యంలో అధ్యక్షుడు మాక్రాన్ బ్రస్సెల్స్ పర్యటనను విరమించుకున్నారు. 

ఆందోళన ఎందుకు...

ఫ్రాన్స్​లో జూన్ 27వ తేదీ  మంగళవారం  నాహెల్​ అనే యువకుడిపై ఓ పోలీసు అధికారి కాల్పులు జరిపాడు. ట్రాఫిక్​ చెక్​ను యువకుడు క్రాస్ చేయడంతో అతనిపై పోలీసులు కాల్పులు జరపగా..నాహెల్ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ట్రాఫిక్ నిబంధనలను పాటించని మాత్రాన చంపే హక్కు పోలీసులకు లేదంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. వరుసగా మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు జరిగాయి.

భగ్గుమన్న ఫ్రాన్స్..

నాహెల్ సంస్మరణ  కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఆందోళన కారులు  ప్రభుత్వ  కార్యాలయాలకు, ప్రభుత్వ వాహనాలకు నిప్పుపెట్టారు. పెద్ద ఎత్తున దాడులకు దిగారు. దీంతో ఫ్రాన్స్ లో  తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేశ వ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. పారిస్ లోని స్కూళ్లు.. టౌన్ హాళ్లు.. పోలీస్ స్టేషన్లు లాంటి వంద ప్రభుత్వ ఆస్తులకు ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఆందోళనకారుల నిరసనల్లో భాగంగా జరిపిన దాడుల్లో 250 మంది పోలీసులు గాయపడ్డారు. ఇప్పటివరకు 600మందిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ అంశాలపై సీరియస్ అయిన ప్రభుత్వం ఫ్రాన్స్ లో అత్యవసర పరిస్థితి విధించింది. 

 

ఫ్రాన్స్లో చరిత్రలో ఆరు సార్లు అత్యవసర పరిస్థితి..

1955 నుండి ఫ్రాన్స్ లో ఇప్పటి వరకు ఆరు సార్లు  అత్యవసర పరిస్థితి విధించారు. తొలిసారిగా 1955లో అల్జీరియన్ యుద్ధ సమయంలో ఎమెర్జెన్సీ ప్రకటించారు. ఆ తర్వాత అల్జీరియాలో తిరుగుబాటు కారణంగా 1958లో, 1961లో  జనరల్స్ పుట్చ్ తర్వాత, 1984లో న్యూ కాలెడోనియాలో స్వాతంత్ర్యం కోసం చేపట్టిన నిరసనల కారణంగా అత్యవసర పరిస్థితి విధించారు. 2005  ఫ్రాన్స్‌లో  అశాంతి నెలకొనడంతో అప్పటి అధ్యక్షుడు జాక్వెస్ చిరాక్ 8 నవంబర్ 2005న అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. 2015 నవంబర్లో  పారిస్ దాడుల సందర్భంగా ఎమెర్జెన్సీ విధించారు. ఈ ఎమెర్జెన్సీ 2017 వరకు కొనసాగింది. తాజాగా మరోసారి ఫ్రాన్స్ లో అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయి.