టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో అద్భుతంగా రాణించాడు. తన 10 ఓవర్ల స్పెల్ లో నాలుగు వికెట్లు పడగొట్టి 41 పరుగులు మాత్రమే ఇచ్చాడు. శనివారం (డిసెంబర్ 6) విశాఖపట్నం వేదికగా డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ కీలక దశలో ఒకే ఓవర్లో డేంజరస్ బ్రేవీస్ తో పాటు మార్కో జాన్సెన్ ను ఔట్ చేసి సౌతాఫ్రికాను భారీ స్కోర్ చేయకుండా కంట్రోల్ చేశాడు. తన బౌలింగ్ స్పెల్ తో అదరగొట్టిన కుల్దీప్ టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మని విసిగించి తిట్లు తిన్నాడు.
ఇన్నింగ్స్ 43 ఓవర్లో సౌతాఫ్రికా 8 వికెట్లు కోల్పోయి 250 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ దశలో 43 ఓవర్ వేస్తున్న కుల్దీప్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఈ ఓవర్ ఐదో బంతి ఎంగిడి వేస్తే బాల్ మిస్ అయ్యి ప్యాడ్లకు తగిలింది. బంతి దూరంగా వెళ్తున్నా కుల్దీప్ రివ్యూ తీసుకోవాల్సిందిగా కెప్టెన్ రాహుల్ ను కోరాడు. అయితే స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ మాత్రం DRS వద్దని చాలా సేపు చెప్పి ఒప్పించే ప్రయత్నం చేశాడు. ఇదే ఓవర్ చివరి బంతి క్లియర్ గా బ్యాట్ కు తగిలితే మరోసారి అప్పీల్ చేసి DRS వెళ్దామా అని రాహుల్ వైపు చూశాడు. అయితే క్లియర్ గా నాటౌట్ కావడంతో కుల్దీప్ ను రోహిత్ సరదాగా తిట్టి పంపించాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ్యాచ్ తర్వాత కుల్దీప్ తాను DRS తీసుకోవడంలో వీక్ అని ఒప్పుకున్నాడు. ప్యాడ్లకు తాకితే తనకు ఔట్ లాగే అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే ప్రత్యర్థి సౌతాఫ్రికాను ఒక మాదిరి స్కోర్ కే పరిమితం చేశారు. కుల్దీప్ యాదవ్ స్పిన్ మ్యాజిక్ కు తోడు.. ప్రసిద్ కృష్ణ తన పేస్ తో విజృంభించడంతో సఫారీలను భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నారు. మరోవైపు ఓపెనర్ క్వింటన్ డి కాక్ (106) సెంచరీతో సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది.
కెప్టెన్ బవుమా 48 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలో నాలుగు వికెట్లు పడగొట్టారు. జడేజా, అర్షదీప్ సింగ్ తలో వికెట్ తీసుకున్నారు. బ్రీట్జ్కే వికెట్ ప్రసిద్ కృష్ణ పడగొట్టడంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ గాడి తప్పింది. ఆతర్వాత వెంటనే ఒక అద్భుత యార్కర్ తో డికాక్ ను బౌల్డ్ చేశాడు. వేగంగా ఆడే క్రమంలో వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతూ వచ్చింది. బ్రేవీస్ (29), జాన్సెన్ (17), కార్బిన్ బాష్ (9) స్వల్ప వ్యవధిలో ఔటవ్వడంతో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేయలేక 270 పరుగులకు ఆలౌటైంది.
