వన్డే, టెస్ట్, టీ20 ఏది వదల్లే: మూడు ఫార్మాట్లలో శతకొట్టిన 7వ ఇండియన్ క్రికెటర్‎గా జైశ్వాల్ రికార్డ్

 వన్డే,  టెస్ట్, టీ20 ఏది వదల్లే: మూడు ఫార్మాట్లలో శతకొట్టిన 7వ ఇండియన్ క్రికెటర్‎గా జైశ్వాల్ రికార్డ్

న్యూఢిల్లీ: టీమిండియా యంగ్ క్రికెటర్ యశస్వీ జైశ్వాల్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డే, టీ20, టెస్ట్‎ మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన 7వ భారతీయ క్రికెటర్‎గా నిలిచాడు. శనివారం (డిసెంబర్ 6) విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో సెంచరీ కొట్టడం ద్వారా జైశ్వాల్ ఈ రికార్డ్ నెలకొల్పాడు. తద్వారా మూడు ఫార్మాట్లలో శతకాలు సాధించిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సరసన చేరాడు. 23 ఏళ్లలోనే వయస్సుల్లోనే జైశ్వాల్ ఈ ఘనత అందుకోవడం విశేషం. 

సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సెంచరీతో సత్తా చాటాడు. తొలి రెండు వన్డేల్లో విఫలమై విమర్శల పాలైన ఈ యువ క్రికెటర్ మూడో వన్డేలో అదరగొట్టాడు. శనివారం (డిసెంబర్ 6) విశాఖపట్నం వేదికగా డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‎లో 111 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇన్నింగ్స్ 35 ఓవర్ రెండో బంతికి కార్బిన్ బాష్ బౌలింగ్‎లో సింగిల్ తీసుకొని తన వన్డే కెరీర్‎లో తొలి సెంచరీ సాధించాడు. 

తొలి రెండు వన్డేల్లో నిరాశపర్చినా సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డేలో మాత్రం సెంచరీతో చెలరేగి టీమిండియాకు విజయాన్ని అందించాడు. దీంతో 2-1 తేడాతో ఇండియా సిరీస్ నెగ్గింది. సొంతగడ్డపై టెస్ట్ సిరీస్ ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. 2025, డిసెంబర్ 9 నుంచి ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య 5 మ్యాచుల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. 

మూడు ఫార్మాట్లలో సెంచరీలు కొట్టిన ఇండియన్ బ్యాటర్స్:

1 సురేష్ రైనా
2 రోహిత్ శర్మ
3 కేఎల్ రాహుల్
4 విరాట్ కోహ్లీ
5 శుభమన్ గిల్
6 స్మృతి మంధాన( మహిళా క్రికెటర్)
7 యశస్వీ జైశ్వాల్