పెద్ద లీడర్ల ప్రస్థానం గల్లీ నుంచే.. ఉమ్మడి జిల్లాలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒకప్పటి కౌన్సిలర్లు, కార్పొరేటర్లే

పెద్ద లీడర్ల ప్రస్థానం గల్లీ నుంచే.. ఉమ్మడి జిల్లాలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒకప్పటి కౌన్సిలర్లు, కార్పొరేటర్లే
  • కార్పొరేటర్లుగా పనిచేసిన బండి సంజయ్‌‌‌‌, గంగుల
  • కౌన్సిలర్లుగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యేలు బొమ్మ  వెంకన్న, కటారి దేవేందర్ రావు, సోమారపు సత్యనారాయణ 

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పేరున్న కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకప్పుడు తమ మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగానే తమ పొలిటికల్ కెరీర్ ను మొదలుపెట్టారు. గల్లీ రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుని.. అసెంబ్లీ, పార్లమెంట్ వరకు ఎదిగారు. కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా పనిచేసిన అనుభవం వారికి ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా రాణించడానికి బాగా పనికొచ్చింది.

ఒకప్పుడు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్ గా పనిచేసిన బండి సంజయ్ నేడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తుండగా.. గంగుల కమలాకర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా, ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అలాగే గతంలో కరీంనగర్ మున్సిపాలిటీలో కౌన్సిలర్‌‌‌‌‌‌‌‌గా గెలిచి మున్సిపల్ చైర్మన్ అయిన కటారి దేవేందర్‌‌‌‌‌‌‌‌రావు ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కౌన్సిలర్‌‌‌‌‌‌‌‌గా ఏకగ్రీవంగా గెలుపొందిన బొమ్మా వెంకన్న ఆ తర్వాత.. ఇందుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రామగుండం మున్సిపల్ చైర్మన్‌‌‌‌గా పని చేసిన సోమారపు సత్యనారాయణ ఆ తర్వాత రామగుండం ఎమ్మెల్యేగా, ఆర్టీసీ చైర్మన్‌‌‌‌గా పనిచేశారు. 

కౌన్సిలర్ నుంచి రాష్ట్ర మంత్రిగా గంగుల.. 

మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ 2000లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అదే ఏడాది కరీంనగర్ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో టీడీపీ కౌన్సిలర్‌‌‌‌గా గెలిచి ఫ్లోర్‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌గా పనిచేశారు. ఆ తర్వాత 2005లో కరీంనగర్ కార్పొరేషన్‌‌‌‌లో కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌గా పోటీ చేసి విజయం సాధించారు.  2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2013లో టీఆర్ఎస్ లో చేరారు.  2014, 2018, 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో గెలిచి కేసీఆర్ కేబినేట్‌‌‌‌లో బీసీ సంక్షేమం, సివిల్ సప్లయీస్ శాఖ మంత్రిగా పనిచేశారు. 

కటారి ప్రస్థానం ఇలా..

కరీంనగర్ నగర రాజకీయాలు, అభివృద్ధిపై తనదైన ముద్ర వేసుకున్న కటారి దేవేందర్‌‌‌‌‌‌‌‌రావు 1981లో జరిగిన కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో సవరన్ స్ట్రీట్ ప్రాంతం నుంచి ఇండిపెండెంట్ కౌన్సిలర్‌‌‌‌గా గెలిచారు. కౌన్సిలర్ గా ఉండగానే 1985లో అప్పటి మున్సిపల్ చైర్మన్ నరహరిపై అవిశ్వాసం పెట్టి కాంగ్రెస్ మద్దతుతో చైర్మన్‌‌‌‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1987లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా, 1995లో ఇండిపెండెంట్‌‌‌‌గా పోటీ చేసి మూడోసారి చైర్మన్‌‌‌‌ అయ్యారు. ఈ క్రమంలోనే 1999లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా తెలుపొందారు.  

కరీంనగర్ మున్సిపాలిటీ నుంచి ఒకసారి కౌన్సిలర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బొమ్మా వెంకటేశ్వర్లు.. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నాయకుడిగా, రాష్ట్రస్థాయి నాయకుడిగా పనిచేశారు. 1989, 1994 ఎన్నికల్లో ఇందుర్తి నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 1999లో గెలుపొంది 2004 వరకు ఐదేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్నారు. కరీంనగర్ మున్సిపాలిటీలో ఒకసారి కౌన్సిలర్‌‌‌‌‌‌‌‌గా గెలుపొందిన టి.సంతోష్ కుమార్.. కొంతకాలం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌‌‌‌ అధ్యక్షుడిగా పనిచేశారు. 2013లో శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. 

1998లో ఏర్పాటైన రామగుండం మున్సిపాలిటీ ఎన్నికల్లో సోమారపు సత్యనారాయణ కాంగ్రెస్ నుంచి  పోటీ చేసి తొలి చైర్మన్‌‌‌‌గా ఎన్నికయ్యారు. అనంతరం టీడీపీలో చేరారు. ఆ తర్వాత 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మంథని నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి కాంగ్రెస్‌‌‌‌ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌బాబు చేతిలో ఓడిపోయారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌‌‌‌గా పోటీ చేసి విజయం సాధించాక కాంగ్రెస్‌‌‌‌లో చేరారు. 2014లో టీఆర్ఎస్ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా 
గెలుపొందారు. 

కార్పొరేటర్ నుంచి కేంద్రమంత్రిగా బండి.. 

కేంద్ర మంత్రి బండి సంజయ్  రాజకీయ ప్రస్థానం కార్పొరేటర్ పదవి నుంచే మొదలైంది.  2005లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌‌‌‌గా అప్ గ్రేడ్ అయ్యాక 2005 నుంచి 2019 వరకు 48వ డివిజన్ నుంచి బీజేపీ కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌గా ప్రాతినిథ్యం వహించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌‌‌‌కు జరిగిన ఎన్నికల్లో మూడు సార్లు వరుసగా కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌గా హ్యాట్రిక్ విజయం సాధించారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన బండి సంజయ్.. 2019, 2024 లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఎంపీగా ఎన్నికై, ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు.