పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లా పరిగిలో గత నాలుగు రోజులుగా ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. బంకుల్లో సరిపడా సిబ్బంది లేకపోవడం, ఒకరే ఇంధనం పోస్తూ నగదు వసూలు చేస్తుండటంతో సమయం వృథా అవుతోంది. బంకుల వద్ద తోపులాటలు జరగకుండా పోలీసులు ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
బంకుల్లో ఇంధనం ఉన్నప్పటికీ నిర్వాహకులు సరఫరాలో జాప్యం చేస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని పలువురు వాహనదారులు ఆరోపిస్తున్నారు. తమకు దొరకని డీజిల్.. రాత్రి వేళల్లో మట్టి వ్యాపారులకు, రోడ్డు కాంట్రాక్టర్లకు మాత్రం ఎలా అందుతోందని ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై స్పందించి, ఇంధన సరఫరాను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నారు.

