జన సంద్రమైన పువ్వర్తి.. ముగిసిన మావోయిస్టు హిడ్మా, ఆయన భార్య రాజే అంత్యక్రియలు

 జన సంద్రమైన పువ్వర్తి.. ముగిసిన మావోయిస్టు హిడ్మా, ఆయన భార్య రాజే అంత్యక్రియలు
  • ఒకే చితిపై భార్యాభర్తల అంతిమ సంస్కారాలు

భద్రాచలం, వెలుగు: మావోయిస్టు అగ్రనేత మడవి హిడ్మా, అతని భార్య రాజే అంత్యక్రియలు చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామంలో ముగిశాయి. ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్​లోని రంపచోడవరం ఏజెన్సీ మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్​కౌంటర్​లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. అందులో దండకారణ్యం మావోయిస్టు పార్టీ దళపతి హిడ్మా, అతని భార్య రాజే ఉన్నారు. బుధవారం వారి మృతదేహాలకు రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పువ్వర్తికి వారి మృతదేహాలను తరలించి గురువారం ఒకే చితిపై ఇద్దరి అంత్యక్రియలు నిర్వహించారు.

 హిడ్మా దంపతుల అంత్యక్రియల సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ.. అవేమీ పట్టించుకోకుండా పువ్వర్తి, జబ్​గట్ట, బటుం, టేకులగూడెం, మీనట్ట తదితర గ్రామాల నుంచి ఆదివాసీలు భారీగా తరలివచ్చారు. కొడుకు మృతదేహంపై పడి హిడ్మా తల్లి మాంజీ పొదిలిపొదిలి రోదించిన దృశ్యం చూపరులను కంటతడి పెట్టించింది. సామాజిక కార్యకర్త సోనీ సోరి సైతం నల్ల ప్యాంటు, చొక్కాను పాడెపై పెట్టి బోరున విలపించారు. పువ్వర్తిని భారీగా భద్రతా బలగాలు దిగ్భంధనం చేసినా.. ఆదివాసీలు భారీ ఎత్తున తరలివచ్చారు.  హిడ్మా, రాజే అంతిమయాత్రలో వందల సంఖ్యలో ఆదివాసీలు పాల్గొని  కన్నీటి వీడ్కోలు పలికారు.