సుస్మిత.. స్కూల్‌‌కు ఎందుకు వెళ్లలే? టెన్త్‌‌ స్టూడెంట్‌‌ ఇంటికి వెళ్లి ఆరా తీసిన యాదాద్రి కలెక్టర్‌‌

సుస్మిత.. స్కూల్‌‌కు ఎందుకు వెళ్లలే? టెన్త్‌‌ స్టూడెంట్‌‌ ఇంటికి వెళ్లి ఆరా తీసిన యాదాద్రి కలెక్టర్‌‌

యాదాద్రి, వెలుగు : ‘సుస్మిత.. ఈ రోజు స్కూల్‌‌కు ఎందుకు వెళ్లలేదు’ అని యాదాద్రి కలెక్టర్‌‌ హనుమంతరావు ఓ టెన్త్‌‌ స్టూడెంట్‌‌ ఇంటికి వెళ్లి ఆరా తీశారు. వివరాల్లోకి వెళ్తే... కలెక్టర్‌‌ హనుమంతరావు గురువారం భువనగిరిలోని హైస్కూల్‌‌కు వెళ్లారు. అక్కడ టెన్త్‌‌ స్టూడెంట్స్‌‌కు మ్యాథ్స్​బోధించి, ఫిజిక్స్‌‌లో ఫార్ములాలు అడిగారు. 

ఎవరైనా స్టూడెంట్స్‌‌ స్కూల్‌‌కు రాకుంటే వారి ఇంటికి ఫోన్‌‌ చేసి ఆరా తీయాలని టీచర్లకు సూచించారు. అనంతరం టెన్త్​క్లాస్‌‌ స్టూడెంట్స్‌‌ ఎంత మంది ఉన్నారో అడిగిన కలెక్టర్‌‌.. బానోతు సుష్మిత అనే స్టూడెంట్‌‌ స్కూల్‌‌కు రాలేదని తెలుసుకున్నారు. వెంటనే భువనగిరి మున్సిపాలిటీ పరిధి సింగన్నగూడెంలోని సుష్మిత ఇంటికి వెళ్లి ఆమెను కలిసి స్కూల్‌‌కు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. 

తన తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడంతో స్కూల్‌‌కు వెళ్లలేదని, ఇప్పుడే హాస్పిటల్‌‌కు తీసుకెళ్లారని సుస్మిత సమాధానం ఇచ్చింది. అనంతరం స్టూడెంట్‌‌ కుటుంబ ఆర్థిక పరిస్థితి వివరాలు తెలుసుకున్నారు. తప్పనిసరిగా స్కూల్‌‌కు వెళ్లాలని, ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తాను చూసుకుంటానని సుస్మితకు కలెక్టర్‌‌ హామీ ఇచ్చారు. సాయంత్రం కలెక్టర్‌‌ తరపున సుస్మితకు బుక్స్‌‌తో పాటు స్టడీ చైర్, రైటింగ్‌‌ ప్యాడ్‌‌ను భువనగిరి తహసీల్దార్‌‌ అందించారు.