నేనే మొదటి బాధితురాలిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలవి కక్ష సాధింపు రాజకీయాలు: కవిత

నేనే మొదటి బాధితురాలిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలవి కక్ష సాధింపు రాజకీయాలు: కవిత
  •     బీజేపీ వాళ్లకు.. వాళ్లమీద వీళ్లమీద కేసులు పెట్టడమే పని 
  •     2014 నుంచి తెలంగాణ ఏమాత్రం డెవలప్​కాలేదు
  •     బతుకమ్మ లెక్క బీసీల బిల్లు ఎత్తుకున్న.. దించేది లేదు
  •     ట్రిపుల్ ​ఆర్​ డిజైన్ మార్చడంలో మతలబేందని ప్రశ్న
  •     రంగారెడ్డి జిల్లాలో  ‘జాగృతి జనం బాట’

హైదరాబాద్​సిటీ నెట్​వర్క్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నాయని, ఆ రాజకీయాల్లో మొదటి బాధితురాలిని తానేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లాలో ‘జాగృతి జనం బాట’ నిర్వహించారు. 

కేపీహెచ్​బీకాలనీ గాంధీ విగ్రహం వద్ద విద్యార్థులు నిర్వహించిన ‘‘సే నో టు డ్రగ్స్”​ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సదర్భంగా ఆమె మాట్లాడుతూ 2014 నుంచి తెలంగాణ ఏమాత్రం అభివృద్ధి చెందలేదని ఆరోపించారు. తెలంగాణకు వారసత్వంగా వచ్చిన ఆస్తులు పోయాయని, ప్రజల కష్టాలు మరింత పెరిగాయని తెలిపారు. 

శేరిలింగంపల్లి ప్రాంతంలోనే 64 చెరువులు మాయమయ్యాయన్నారు. ‘బీజేపీ వాళ్లకు వాళ్ల మీద వీళ్ల మీద కేసులు పెట్టటం తప్ప ఇంకో పని లేదు. ప్రజలకు మొఖం చూపించలేక ప్రభుత్వాలు ప్రతిపక్ష లీడర్ల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయి.. అందులో మొదటి బాధితురాలిని నేనే’ అని ఆమె అన్నారు.

బీసీలకు రాజ్యాధికారం హక్కుగా రావాలే

‘బీసీలకు రిజర్వేషన్లు సాధించడమంటే తెలంగాణ సాధన కన్నా కష్టమైన పని, నేను బతుకమ్మ, బోనం ఎత్తుకున్నట్లు బీసీ రిజర్వేషన్ల బిల్లు ఎత్తుకున్నా.. అది సాధించే వరకు దించేదే లేదు’ అని కవిత అన్నారు. శంకర్​పల్లి మండలం మోకిలాలో ఎల్లమ్మ, మల్లమ్మ దేవాలయ వార్షికోత్సంలో పాల్గొని షాబాద్​వెళ్లారు. 

అక్కడ బీసీ సంఘాలు చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ‘బీసీ రిజర్వేషన్ కోసం పార్లమెంటులో బిల్లును పాస్ చేయించాలని, బీసీలకు స్థానిక సంస్థల్లోనే కాకుండా విద్య, ఉద్యోగ అవకాశాల్లోనూ రిజర్వేషన్ కల్పించే విధంగా కొట్లాడాలి’ అని అన్నారు. ఆర్​కృష్ణయ్య, చిరంజీవులు ఆధ్వర్యంలో నడుస్తున్న జేఏసీలకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారు. 

షాద్​నగర్​ప్రభుత్వ కమ్యూనిటీ దవాఖానను సందర్శించి ఆమె మాట్లాడుతూ ఆస్పత్రి భవనం పెచ్చులూడిపోతున్నదని, వంద పడకలుగా మార్చి కొత్త భవనానికి తరలించాలని ప్రభుత్వాన్ని కోరారు. ‘పెద్దోళ్ల భూములను వదిలేస్తారు.. పొద్దునలేస్తే పేదోళ్ల భూములపై పడతారు.. పేదోడికో న్యాయం.. పెద్దోడికి ఓ న్యాయమా? దీనిపై పోరాటానికి సిద్ధమవుదాం. పీఎం.. సీఎం. ఎవరైనా సరే కొట్లాడుదాం. రాజీ పడే ప్రశ్న లేదు’ అని అన్నారు. 

కేశంపేట మండలం తొమ్మిది రేకుల గ్రామంలో రీజనల్​రింగ్ రోడ్డులో భూములను కోల్పోతున్న రైతులను పరామర్శించి మాట్లాడారు. గతంలోనే భూములకు సంబంధించి ప్రభుత్వం డిజైన్ వేసిందని, తిరిగి దాన్ని మార్చడంలో మతలబు ఏమిటని ప్రశ్నించారు.