- బాలికపై బాలుడి లైంగికదాడి
- గర్భవతి అని తేలడంతో అబార్షన్‌కు కుటుంబసభ్యుల యత్నం
- బాలుడితో పాటు అబార్షన్ చేసేందుకు యత్నించిన మహిళ అరెస్ట్
చిట్యాల, వెలుగు : బాలికను గర్భవతిని చేసిన బాలుడితో పాటు అబార్షన్ చేసేందుకు ప్రయత్నించిన మహిళను నార్కట్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను నార్కట్‌పల్లి సీఐ నాగరాజు గురువారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామానికి చెందిన ఓ బాలుడికి చిట్యాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయింది.
ఈ క్రమంలో బాలుడు పలుమార్లు బాలిక ఇంటికి వచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇటీవల బాలిక ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమె తల్లి చిట్యాలలో సాయితేజ పేరుతో హాస్పిటల్ నడుపుతున్న రిటైర్డ్ మల్టీపర్సస్ హెల్త్ సూపర్‌వైజర్ అండాలు వద్దకు తీసుకెళ్లింది. బాలికను పరిశీలించిన అండాలు.. నల్గొండలో తనకు తెలిసిన స్కానింగ్ సెంటర్‌కు పంపింది. స్కానింగ్ రిపోర్ట్‌లో బాలిక గర్భవతి అని తేలింది.
దీంతో రూ. 25 వేలు ఇస్తే గర్భాన్ని తొలగిస్తానని ఆండాల్ చెప్పగా.. బాలిక కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో ఓ ట్యాబ్లెట్ ఇచ్చింది. ఈ సమాచారం తెలుసుకున్న చిట్యాల ఐసీడీఎస్ సిబ్బంది, పోలీసులు సాయితేజ హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు.
బాలికను గర్భవతిని చేసిన బాలుడితో పాటు, అబార్షన్ చేసేందుకు ప్రయత్నించిన ఆండాలుపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. మూడో సంతానం వద్దని అబార్షన్ కోసం వచ్చిన మరో మహిళను నల్గొండలోని సఖి కేంద్రానికి తరలించారు.
