హైదరాబాద్, వెలుగు: నకిలీ ఈ- కామర్స్ ప్లాట్‌ఫార్మ్స్, నకిలీ యాప్స్, ఫేక్ వెబ్‌సైట్ల ద్వారా సైబర్ మోసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఏపీలోని కడప సహా దేశవ్యాప్తంగా నమోదైన కేసుల ఆధారంగా కాయిన్ డీసీఎక్స్, పలు క్రిప్టో వాలెట్‌లకు సంబంధించిన 92 బ్యాంక్ అకౌంట్లలోని రూ.8.46 కోట్లు తాత్కాలిక జప్తు చేసింది. ఈ మేరకు హైదరాబాద్ జోనల్ ఈడీ ఆఫీసు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.
కడప పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. మోసగాళ్లు వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులను ఉపయోగించి బల్క్ ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపిస్తున్నట్టు గుర్తించింది. బ్యాంకు ఖాతాలు, యూపీఐ చెల్లింపులు, షెల్ ఎంటిటీలకు లింక్ చేయబడిన వాట్సాప్ ఏజెంట్ల ద్వారా ఆన్‌లైన్‌లో దోపిడీకి పాల్పడుతున్నారు. ఇలా దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో బాధితుల నుంచి సుమారు రూ.285 కోట్లు కొల్లగొట్టినట్లు ఈడీ దర్యాప్తులో వెలుగుచూసింది.
