‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రంలోని ప్రేమకథ చాలా అందంగా ఉంటుందని, ఇందులోని ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుందని హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే చెప్పింది. రామ్ పి మహేష్ బాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
ఈ సందర్భంగా భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ ‘‘ఇది ఓ హీరోను అమితంగా ఆరాధించే అభిమాని కథ. 2000 బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. అభిమానం అనేది డివైన్ ఎమోషన్. ఎలాంటి రిలేషన్ లేకుండా ఒక హీరోను ఎంతలా ప్రేమిస్తారో ఇందులో చూపించారు. ఇందులో నేను మహాలక్ష్మి అనే కాలేజ్ గర్ల్‌గా, రామ్‌కు లవర్‌గా కనిపిస్తా. కథలో తన క్యారెక్టర్ కీలకం. ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేలా ఉంటుంది. ఇన్నాళ్లూ గ్లామర్ రోల్స్‌తో అలరిస్తే.. ఇందులో మహాలక్ష్మిగా మెప్పిస్తా.
రామ్‌తో నటించడం అమేజింగ్ ఎక్స్‌పీరియెన్స్. తులసి, రావు రమేష్, మురళి శర్మ లాంటి సీనియర్స్ నటించారు. వాళ్ళందరి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాను కూడా అలాగే ఆదరిస్తారని నమ్ముతున్నా. నాకు వచ్చిన ప్రతి క్యారెక్టర్‌కి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఇచ్చి ఒక వెర్సటైల్ యాక్ట్రెస్‌గా పేరు తెచ్చుకోవాలని ఉంది. అనుష్క గారు పోషించిన ‘అరుంధతి’ తరహా పాత్రలు ఇష్టం. భవిష్యత్తులో అలాంటి పాత్రలు వస్తాయని ఆశిస్తున్నా’’ అని చెప్పింది.
