టికెట్ ఇచ్చినా.. ఇవ్వకపోయినా కాంగ్రెస్ వెంటే : గద్దర్ కుమార్తె

టికెట్ ఇచ్చినా.. ఇవ్వకపోయినా కాంగ్రెస్ వెంటే : గద్దర్ కుమార్తె

తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి మేం సిద్దంగా ఉన్నామని గద్దర్ కూతురు వెన్నెల తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో 2023, అక్టోబర్ 21వ తేదీ శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో గద్దర్ కూతురు వెన్నెల మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నానని.. టికెట్ ఇవ్వకపోయినా కాంగ్రెస్ కోసం పనిచేస్తాని చెప్పారు. కొన్ని రోజులుగా తన పేరు మీడియాలో వస్తోందని.. అదే క్రమంలో రాజకీయాల్లోకి రమ్మని చాలా మంది తనపై ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. 

Also Read : AMR సంస్థ ఆఫీసు, ఛైర్మన్ మహేష్ రెడ్డి ఇంట్లో ఐటీ శాఖ తనిఖీలు

తనకు కాంగ్రెస్ అవకాశం ఇస్తే పోటీ చేస్తానని.. మాలో ప్రజల కోసం కొట్లాడాలనే ఫైటింగ్ స్పిరిట్ ఉందన్నారు. తనకు కంటోన్మెంట్ సీటు ఇస్తే అక్కడి కాంగ్రెస్ నాయకులను కలుపుకొని పని చేస్తానన్నారు. మా నాన్న చివర్లో కాంగ్రెస్ కి సపోర్ట్ చేశారని.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని, ఓడిపోయినా సరే ఎన్నికల్లో పోటీ చేస్తానని గద్దర్ ప్రకటించారని తెలిపారు. నాన్న ఆశయాన్ని నెరవేర్చడానికే రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు. గద్దర్ జీవితాంతం సమసమాజం కోసం తపన పడ్డారని.. భారత రాజ్యాంగాన్ని అమలు పరచాలని ఆయన కోరుకునేవారని చెప్పారు.

రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తామని కాంగ్రెస్ అంటోంది.. కాబట్టే కాంగ్రెస్ పార్టీకి మా మద్దతు తెలుపుతున్నామని.. టికెట్ ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తామని స్పష్టం చేశారు. తన బిడ్డకి టికెట్ ఇస్తామని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు మీడియాలో వస్తోందని.. టికెట్ ఇస్తే ఆమె తరపున ప్రచారం చేస్తా, తన బిడ్డకి కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని కోరుతున్నానని గద్దర్ భార్య విమల అన్నారు.