- ముందుకు సాగని జూరాల రోడ్ కం హైలెవెల్ బ్రిడ్జి
- గద్వాల జిల్లా కోర్టు స్థల ఎంపికపై ఏడాదిగా వివాదం
- నడిగడ్డలోప్రతి డెవలప్‌మెంట్ పనిపై రగడే
గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో డిఫరెంట్ రాజకీయం నడుస్తోంది. ప్రతి డెవలప్‌మెంట్ పనిపై రగడ నడుస్తుండడంతో అవి ముందుకుపడడం లేదు. 15 ఏండ్ల నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. ఒకరు చేద్దామని ప్రపోజల్స్ పెడితే.. మరొకరు ఏదో ఒక రూపంలో అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దానిని ప్రిస్టేజ్‌గా తీసుకుంటున్న నేతలు తమ రాజకీయ ఆధిపత్యం కోసం ఆందోళనలకు దిగడం జిల్లాలో పరిపాటిగా మారింది. స్థలం ఎంపిక కోసమే రెండేండ్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంటోంది.
దీంతో ఆ పనులు ప్రారంభమై పూర్తి కావడానికి ఏండ్లు పడుతోంది. ఇదిలాఉంటే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఎమ్మెల్యే నడిగడ్డలో గెలవకపోవడం అభివృద్ధికి మరింత అడ్డంకిగా మారుతోంది. గత బీఆర్ఎస్ ఐదేండ్ల టర్మ్ మాత్రమే రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా, జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలే గెలిచారు అయినప్పటికీ చెప్పుకోదగ్గ డెవలప్‌మెంట్ జరగలేదు.
ఒకరు అక్కడంటే.. మరొకరు ఇక్కడంటరు..
జోగులాంబ గద్వాల జిల్లాకు వచ్చే అభివృద్ధి పనులపై ఏకాభిప్రాయం లేకపోవడంతో పనులు మొదలు కావడానికే ఏండ్లు పడుతున్నాయి. ఇటీవల గద్వాల జిల్లాకు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వచ్చారు. జూరాల ప్రాజెక్టు డ్యాం సేఫ్టీలో భాగంగా రోడ్ కం హై లెవెల్ బ్రిడ్జిని మంజూరు చేశారు. దానిని కొందరు ధరూర్ మండలం దేవులపల్లి దగ్గర కట్టాలంటే, మరొకరు గద్వాల మండలం కొత్తపల్లి దగ్గర కట్టాలని ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించారు. దీంతో ఆ పని ముందుకు పడలేదు. గద్వాల జిల్లాకు కోర్టు కాంప్లెక్స్ మంజూరైంది. స్థలం ఎంపికపై ఏడాదిగా వివాదం కొనసాగుతూనే ఉంది.
కొందరు అనంతపురం గుట్టలో కట్టాలని, మరికొందరు గద్వాల పరిసర ప్రాంతాల్లో కట్టాలని రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు చేశారు. ఇప్పటికీ దీనిపై క్లారిటీ రాలేదు. గతంలో మార్కెట్ యార్డ్ స్థలాన్ని తీసుకొని బీఆర్ఎస్ ఆఫీస్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ కట్టడంపై కూడా పెద్ద గలాట జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం, మెడికల్, నర్సింగ్ కాలేజీల నిర్మాణాలపై కూడా కిరికిరి నడిచింది. చివరకు అక్కడ నిర్మాణాలు చేపట్టవద్దని కోర్టుకు కూడా వెళ్లారు. ఇలా ఏ డెవలప్‌మెంట్ పని వచ్చినా అది స్టార్ట్ కావడానికి ఏండ్లు, నెలలు రాద్ధాంతం నడుస్తోంది.
ఆధిపత్యం కోసమే ఆరాటం..
నడిగడ్డలోని రాజకీయ నాయకులు తమ రాజకీయ ఆధిపత్యం కోసం ఆరాట పడుతున్నారనే విమర్శలున్నాయి. ఒకే పార్టీలోనే రెండు వర్గాలు ఉండడం, ఒకరు పనులు చేపట్టడానికి ప్రయత్నిస్తే మరొకరు అడ్డంకులు సృష్టించడం, ఆ పనులపై రాద్ధాంతంతో తమ రాజకీయ పబ్బం గడుపుకోవడం నడిగడ్డలో పరిపాటిగా మారింది. వాటికి తోడు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఈ గొడవలకు మరింత ఆజ్యం పోస్తున్నారు. ఎక్కడ పనులు చేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందనే విషయాన్ని పక్కన పెట్టి కేవలం ఆధిపత్యం కోసమే అన్నట్లుగా కొందరు నేతలు, సంఘాలు వ్యవహరిస్తున్నాయని అంటున్నారు. డెవలప్‌మెంట్ పనులపై ఒక విజన్ ప్రకారం ముందుకు పోకపోవడం ప్రజలకు శాపంగా మారుతోంది. దీంతో కొన్ని అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి.
గతం నుంచి ఇదే తంతు..
నడిగడ్డలో 15 ఏండ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. కాంగ్రెస్ నుంచి గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ గెలవగా, అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చింది ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న ఆమెను కాదని, నియోజకవర్గ ఇన్చార్జితో పనులు చేయించడం అప్పట్లో వివాదాస్పదంగా మారింది. దీంతో అప్పట్లో ప్రతి పనిపై గొడవలు జరిగేవి. ఈ రగడకు ఎప్పుడు పుల్ స్టాప్ పడుతుందో? డెవలప్‌మెంట్ వర్క్స్ సాఫీగా ఎప్పుడు ముందుకు పోతాయో వేచి చూడాల్సిందే.
