
- హైకోర్టులో గాలి జనార్దన్ రెడ్డి పిటిషన్
- ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి
- గాలి సహా మరో ముగ్గురు అప్పీల్
హైదరాబాద్, వెలుగు: ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ఏడేళ్ల జైలుశిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు వెలువరించిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ గాలి జనార్దన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయనతో పాటు బీవీ శ్రీనివాసరెడ్డి, గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీడీ రాజగోపాల్, గాలి పీఏ మెఫజ్ అలీఖాన్ హైకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. అన్ని ఆధారాలను పరిశీలించకుండా సీబీఐ కోర్టు తమకు శిక్ష విధించిందని, దీనివల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు పేర్కొన్నారు.
అప్పీళ్లపై విచారణ ముగిసేదాకా సీబీఐ కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ బెయిలు మంజూరు చేయాలని కోరారు. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. గతంలోనూ బెయిలుపై ఉన్నపుడు షరతులను ఉల్లంఘించలేదన్నారు. సరిహద్దు వివాదాలు, అక్రమ మైనింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తును కోరితే సీబీఐ పరిధికి మించి లీజులపై దర్యాప్తు చేసిందని, దీని ఆధారంగానే సీబీఐ కోర్టు శిక్ష విధించిందన్నారు. కంపెనీ తప్పులకు డైరెక్టర్లను బాధ్యులుగా చేయరాదని, కంపెనీ తరపున తాము నేరపూరిత చర్యలకు పాల్పడినట్లు ఎక్కడా పేర్కొనకుండా సీబీఐ కోర్టు శిక్ష విధించిందన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న తనకు విధించిన శిక్ష అమలును నిలిపివేయని పక్షంలో నియోజకవర్గానికి సేవ చేసుకునే అవకాశం కోల్పోతానని చెప్పారు. కాగా.. దోషులు దాఖలు చేసిన అప్పీళ్లపై వేసవి సెలవుల ప్రత్యేక కోర్టు ఈనెల 21న విచారణ చేపట్టే అవకాశం ఉంది.