
హైదరాబాద్, వెలుగు : పీఎంఈ బస్ సేవా స్కీమ్ లో భాగంగా ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణలో జీసీసీ (గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ ) విధానం వద్దని ఏఐఆర్ టీడబ్ల్యూఎఫ్ (ఆలిండియా రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్) జనరల్ సెక్రటరీ లక్ష్మయ్య కోరారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను ఎస్టీయూ (స్టేట్ ట్రాన్స్ పోర్ట్ యుటిలిటీస్, ఆర్టీసీలు) లకు ఇవ్వాలని కోరుతూ కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి శుక్రవారం ఆయన లేఖ రాశారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద కేంద్రం నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఫేమ్ 1, 2 ( ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ర్టిక్ వెహికిల్స్) స్కీమ్ కింద ఎలక్ట్రిక్ బస్సులు జీసీసీ మోడల్ లో నడుస్తున్నాయని, దీనివల్ల ఎస్టీయూల లాభాలు ప్రైవేట్ ఆపరేటర్లకు వెళుతున్నాయని ఆయన వివరించారు. రాష్ర్టాల్లో ఆర్టీసీలు అన్ని ప్రాంతాలకు తక్కువ టికెట్లతో బస్సులు నడపుతున్నాయని, వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయని తెలిపారు. నష్టాలు, అప్పుల్లో ఉన్న ఆర్టీసీలను కేంద్రం ఆదుకోవాలన్నారు.
పీఎంఈ బస్ సేవా స్కీమ్ లో తీసుకొస్తున్న ఎలక్ర్టిక్ బస్సులను జీసీసీ మోడల్ లో ప్రైవేట్ ఆపరేటర్లకు ఇస్తే ఆర్టీసీలు మరింత నష్టాల్లోకి వెళతాయన్నారు. రూ. 57,613 కోట్లతో పీఎం ఎలక్ట్రిక్ బస్ సేవా పథకం కింద 169 నగరాల్లో 10,000 ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ఇటీవల కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఇందులో కేంద్రం రూ.20 వేల కోట్లు ఇస్తుండగా, మిగిలిన రూ.37,613 కోట్లు రాష్ర్టాలు సమాకూర్చాలని ప్రతిపాదించారు.