అల్లం ఛాయ్.. లేదు బాసూ..

అల్లం ఛాయ్.. లేదు బాసూ..

వానాకాలం.. కూల్ వెదర్.. ఉదయం, సాయంత్రమే కాదు.. వీలున్నప్పుడల్లా వేడి వేడిగా టీ, కాఫీ తాగాలని అనిపిస్తుంది. అంతేనా.. వానాకాలం కావటంతో.. గొంతులో నస, జలుబు, దగ్గు వంటి రాకుండా.. హెల్త్ కేర్ కింద అల్లం ఛాయ్.. అదేనండీ జింజర్ టీ తాగితే హాయిగా ఉంటుందనే ఫీలింగ్ అందరిదీ. టీ తాగే అలవాటు ఉన్న ప్రతి ఒక్కరూ.. ఈ కాలంలో అల్లం ఛాయ్ కే ప్రిఫర్ చేస్తారు. ఇంట్లో అంటే ఒకే.. ఉద్యోగం, వ్యాపారం కోసం బయట తిరిగే వాళ్లకు.. ఇప్పుడు అల్లం ఛాయ్ కరువైంది.. టీ షాపుల దగ్గరకు వెళ్లి.. బాసూ ఓ అల్లం ఛాయ్ అనగానే.. అల్లం ఛాయ్ లేదు బాసూ అనే రిప్లయ్ సౌండ్ గట్టిగా వినిపిస్తుంది.. ఎందుకు అంటే కిలో అల్లం 300 రూపాయలు.. ఇంత ధర పెట్టి అల్లం ఛాయ్ ను.. కప్పు 15 రూపాయలకు అమ్మటం అంటే కష్టం అనుకుని.. టీ షాపుల వాళ్లు అల్లం కొనుగోలు చేయటమే మానేశారు. 

ఎవరైనా అల్లం ఛాయ్ మాత్రమే కావాలి అంటే.. కప్పు 30 రూపాయలు అని ముఖాన చెప్పేస్తున్నారు. టీ 30 రూపాయలు అని.. రెగ్యులర్ ఛాయ్ తాగేసి వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో రోజువారీగా కొన్ని లక్షల టీలు అమ్ముడుపోతుంటాయి. కరోనా తర్వాత అల్లం ఛాయ్ అనేది చాలా మంది రెగ్యులర్ అయ్యింది. హెల్త్ పరంగా చూసినా అల్లం ఛాయ్ ను ప్రిఫర్ చేస్తున్నారు టీ ప్రియులు.

ఇలాంటి టైంలో.. కిలో అల్లం 300 రూపాయలు పెట్టి.. అల్లం ఛాయ్ ను 10, 15 రూపాయలు ఇవ్వాలంటే టీ వ్యాపారులు ససేమిరా అంటున్నారు. ఇంత రేటులో అల్లం ఛాయ్ ను.. రెగ్యులర్ ధరలో ఇవ్వలేం అంటున్నారు. అల్లం రేటు పెరిగింది కదా అని.. ఇప్పుడు టీ ధర పెంచితే వ్యాపారం దెబ్బతింటుందని.. అందుకే లేదు అని చెప్పేస్తున్నాం అంటున్నారు టీ వ్యాపారులు.

మొత్తానికి హైదరాబాదీలకు అల్లం ఛాయ్ లేదు బాసూ అనే మాట.. టీ షాపుల దగ్గర రెండు రోజులుగా రెగ్యులర్ గా వినిపిస్తుందండీ..