Tripti Dimri: ‘స్పిరిట్’లో హీరోయిన్గా తృప్తి డిమ్రినే ఎందుకంటే.. సందీప్ రెడ్డి వంగా బుర్రేబుర్ర..!

Tripti Dimri: ‘స్పిరిట్’లో హీరోయిన్గా తృప్తి డిమ్రినే ఎందుకంటే.. సందీప్ రెడ్డి వంగా బుర్రేబుర్ర..!

‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ ఎవరనే కన్ఫ్యూజన్కు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెర దించాడు. ‘యానిమల్’ సినిమాతో ఓవర్ నైట్ సెలబ్రెటీగా గుర్తింపు తెచ్చుకున్న తృప్తి డిమ్రినే ‘స్పిరిట్’ సినిమాలో హీరోయిన్ అని సందీప్ రెడ్డి వంగా ప్రకటించాడు. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తృప్తి డిమ్రికి ఇది రెండో సినిమా. రణ్ బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన బ్లాక్బస్టర్ సినిమా ‘యానిమల్’లో కూడా తృప్తి డిమ్రి ఒక కీలక పాత్రలో బోల్డ్గా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.

‘యానిమల్’ సినిమాకు ముందు ఒకలా.. తర్వాత మరోలా తృప్తి డిమ్రికి అవకాశాలు తలుపు తట్టాయి. ఇక.. ‘స్పిరిట్’ సినిమాలో హీరోయిన్ ఎంపిక విషయానికొస్తే.. తొలుత దీపికా పదుకొనేను డైరెక్టర్ ఎంచుకున్నాడు. అయితే.. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు, ఆమెకూ సెట్ అవలేదు. ఆమె పెట్టిన కండీషన్లు దర్శకుడితో పాటు నిర్మాతలకు కూడా నచ్చకపోవడంతో ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా తప్పుకుందని తెలిసింది.

తెలుగులో డబ్బింగ్ చెప్పడానికి ఆమె నిరాకరించిందని, రోజుకు 8 గంటలు మాత్రమే తాను నటిస్తానని, 20 కోట్లకు పైగా భారీ పారితోషికం ముట్టజెప్పాలని.. ఇలా ఈ ‘కల్కి’ బ్యూటీ పెట్టిన షరతులతో ‘స్పిరిట్’ టీంకు బుర్రతిరిగిపోయిందని టాక్. ఆమెతో సెట్ అవదని డిసైడ్ అయిన సందీప్ రెడ్డి వంగా మరో బ్యూటీ కోసం వెతుకులాట సాగించాడు. ఈ క్రమంలో.. రుక్మిణీ వసంత్ అని, మృణాల్ ఠాకూర్ అని.. ఇలా ఇద్దరుముగ్గురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ.. తనతో కలిసి పనిచేసిన తృప్తి డిమ్రి వైపే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మొగ్గుచూపాడు.

‘పాన్ ఇండియా’ సినిమా కాదు ‘స్పిరిట్’ సినిమాను ‘పాన్ వరల్డ్’ సినిమాగా చెబుతున్నారు. ఇలాంటి సినిమాలో తృప్తి డిమ్రి లక్కీ ఛాన్స్ కొట్టేసిందనే చెప్పాలి. ఈ సినిమాలో వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ ఈమెనే. ప్రస్తుతం దడక్-2 సినిమాతో పాటు దర్శకుడు విశాల్ భరద్వాజ్ సినిమాలతో తృప్తి బిజీగా ఉంది. తృప్తి డిమ్రిని సందీప్ ఎంచుకోవడానికి కారణాలు లేకపోలేదు.

సందీప్ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో ఆమెకు ముందే ఒక క్లారిటీ ఉంది. సో.. క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చే ఛాన్స్ ఉండదు. తృప్తి అయితే తను చెప్పింది తూచా తప్పకుండా చేసుకుంటూ పోతుందనే క్లారిటీ సందీప్కు ఉంది. గతంలో కలిసి పనిచేసిన వాళ్లే కాబట్టి హీరోయిన్, డైరెక్టర్ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలకు తావు ఉండదు. ఇలా.. ఇన్ని లెక్కలేసుకుని తృప్తి డిమ్రిని ప్రభాస్ సరసన హీరోయిన్గా సందీప్ రెడ్డి వంగా అనౌన్స్ చేశాడు.