
- కాలంచెల్లిన ప్రదర్శనలంటూ ‘సన్’ పత్రిక ఇంటర్వ్యూలో కామెంట్
- మిల్లా ఆరోపణల్లో వాస్తవం లేదన్న మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ
- ఆమె తల్లి ఆర్యోగం బాగాలేదనడంతో స్వదేశానికి పంపించామని వెల్లడి
- బ్రిటిష్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేశారని ఫైర్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లో నిర్వహిస్తున్న 72వ మిస్వరల్డ్పోటీల్లో కలకలం రేగింది. పోటీల నుంచి మిస్ఇంగ్లాండ్మిల్లా మాగీ తప్పుకున్నారు. అయితే, మిల్లా స్వదేశానికి చేరుకున్న తర్వాత అక్కడి ‘సన్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిస్‌వరల్డ్ పోటీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన తల్లి ఆరోగ్యం బాగా లేదని, వ్యక్తిగత కారణాలతోనే పోటీల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటిస్తూనే.. నిర్వాహకులు తననో వేశ్యలా చూశారని, అందుకే మనస్తాపంతో పోటీల నుంచి వైదొలిగినట్టు పేర్కొన్నారు. అవి కాలం చెల్లిన ప్రదర్శనలంటూ కామెంట్చేశారు.
‘‘మిస్ వరల్డ్ పోటీల ఉద్దేశం మంచిదే అయినా.. నిర్వహణ తీరు బాగాలేదు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు మేకప్ తోనే ఉండాల్సి వచ్చేది. సాయంత్రాలు మేల్ స్పాన్సర్లతో కూర్చోవాల్సి వస్తున్నది. ఆ సమయంలో గౌన్లు ధరించాలని ఒత్తిడి చేశారు. మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? ’’ అంటూ ఫైర్అయ్యారు. మార్పు తీసుకురావడానికే ఈ పోటీలకు వెళ్లానని.. కానీ, కోతుల ప్రదర్శనలా కూర్చోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ‘‘1960 నుంచి మిస్ వరల్డ్ పోటీల్లో ఎలాంటి మార్పులేదు. ఆరుగురు అతిథులు ఉన్న ప్రతి టేబుల్‌కు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. సాయంత్రం వారితో కూర్చోవాలి.
వారికి కృతజ్ఞతలు తెలుపుతూ వినోదం అందించాలి. అది నాకు నచ్చలేదు. ఇది చాలా తప్పు అని నేను అనుకున్నా.. ప్రజల వినోదం కోసం నేను ఇక్కడి రాలేదు. 109 మంది ఫైనలిస్టులను బోరింగ్ అని తిట్టారు. ఇలాంటి విలువల్లేని చోట నేను ఉండలేకపోయాను. అందుకే మిస్ వరల్డ్పోటీల నుంచి తప్పుకున్నా’ అని మిల్లా పేర్కొన్నారు.
విలువలకు కట్టుబడి ఉన్నాం: జూలియా మోర్లీ
మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ ఆరోపణలను మిస్ వరల్డ్ సంస్థ సీఈఓ జూలియా మోర్లీ ఖండించారు. బ్రిటిష్ మీడియాలో వచ్చిన వార్తలు, ఆరోపణలను తప్పుపట్టారు. మిల్లా మాగీ ఈ నెల ప్రారంభంలో తన తల్లి ఆరోగ్యం బాగాలేదని అత్యవసర పరిస్థితి కారణంగా పోటీల నుంచి వైదొలుగుతున్నానని తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ఆమె పరిస్థితిని అర్థం చేసుకొని వెంటనే ఇంగ్లాండ్ పంపించామని చెప్పారు.
పోటీలపై బ్రిటిష్ మీడియాలో మిల్లా మాగీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, పత్రికల్లో వచ్చిన కథనాలను ఖండించారు. మిస్ వరల్డ్ సంస్థ నిజాయతీ, గౌరవం, బ్యూటీ విత్ ఎ పర్పస్ విలువలకు కట్టుబడి ఉందని, నిబద్ధతగా పోటీలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. మీడియా సంస్థలు కూడా కొన్ని వార్తల విషయంలో వివరణ తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
అంతరం పోటీల ప్రారంభ సమయంలో మిల్లా మాగీ పంచుకున్న అభిప్రాయాలకు సంబంధించిన ఎడిట్ చేయని వీడియో క్లిప్ లను మిస్ వరల్డ్ సంస్థ శనివారం విడుదల చేసింది. అందులో ఆమె తన ఆనందాన్ని, కృతజ్ఞత, అనుభవాన్ని వ్యక్తపరిచిన తీరు, ఇక్కడి ఆతిథ్యం, ఫుడ్బాగున్నాయని మెచ్చుకున్న వీడియోలు ఉన్నాయి.
ఇంగ్లాండ్ తరఫున మిస్ షార్లెట్ ప్రాతినిధ్యం
మిల్లా మాగీ మిస్ వరల్డ్ పోటీల నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో మిస్ ఇంగ్లాండ్ మొదటి రన్నరప్ మిస్ షార్లెట్ గ్రాంట్ (25) పేరు తెరపైకి వచ్చింది. ఈ పోటీల్లో ఇంగ్లాండ్ తరఫున ఆమె ప్రాతినిధ్యం వహించేందుకు ముందుకొచ్చారు. బుధవారం మిస్ షార్లెట్ ఇండియాకు చేరుకున్నారు. సంస్థ ప్రతినిధులు కూడా ఆమెకు మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు.