
ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు ముగ్గురు క్రికెటర్లు స్థానం సంపాదించి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు భారత టెస్ట్ జట్టును బీసీసీఐ శనివారం (మే 24) ప్రకటించింది. మొత్తం 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును అనౌన్స్ చేసింది. ఈ మెగా సిరీస్ కు కరుణ్ నాయర్ 8 ఏళ్ళ తర్వాత చోటు దక్కించుకొని సంచలనంగా మారితే.. యువ క్రికెటర్లు సాయి సుదర్శన్, అర్షదీప్ సింగ్ తొలిసారి టెస్ట్ జట్టులో స్థానం సంపాదించారు. ఈ ముగ్గురు టెస్ట్ స్క్వాడ్ లో స్థానం సంపాదించుకోవడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
8 ఏళ్ళ తర్వాత కరుణ్ నాయర్ ఎంట్రీ:
టీమిండియా సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ 8 ఏళ్ల తర్వాత తిరిగి టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. దేశవాళీ క్రికెట్ లో అసాధారణ క్రికెట్ తో దూసుకెళ్తున్న కరుణ్ నాయర్ కు ఛాన్స్ రావడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. 33 ఏళ్ల కరుణ్ నాయర్ 2017 నుండి టీమిండియా తరపున ఆడలేదు. 2016 లో ఇంగ్లాండ్ పై ట్రిపుల్ సెంచరీ చేసిన ఈ కర్ణాటక బ్యాటర్ ఆ తర్వాత పేలవ ఫామ్ తో జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే ఇటీవలే దేశవాళీ క్రికెట్ లో నాయర్ దుమ్ము రేపాడు. వరుస సెంచరీలతో హోరెత్తించాడు. దీంతో 8 ఏళ్ళ తర్వాత ఈ వెటరన్ ప్లేయర్ ను సెలక్ట్ చేశారు.
అర్షదీప్ కు గోల్డెన్ ఛాన్స్:
ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు అర్షదీప్ కు ఛాన్స్ దక్కుతుందని ఎవరూ భావించలేదు. అయితే సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ పూర్తి ఫిట్ నెస్ సాధించకపోవడంతో అర్షదీప్ ఒక్కసారిగా రేస్ లోకి వచ్చాడు. లెఫ్టర్మ్ సీమర్ అవసరం కూడా ఉండడంతో 18 మంది స్క్వాడ్ లో ఈ పంజాబీ పేసర్ స్థానం దక్కించుకున్నాడు. అయితే తుది జట్టులో చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తుంది. పరిమిత ఓవర్ల క్రికెట్ లో తనదైన మార్క్ వేసిన అర్షదీప్ టెస్టుల్లో చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి. రంజీ ట్రోఫీలో పంజాబ్ తరపున ఆకట్టుకునే ప్రదర్శన చేయడం కలిసి వచ్చింది.
సాయి సుదర్శన్ కు కలిసొచ్చిన ఐపీఎల్:
టీమిండియా యువ బ్యాటర్ సాయి సుదర్శన్ కు ఐపీఎల్ వరంలా మారింది. గుజరాత్ టైటాన్స్ తరపున అత్యంత నిలకడగా ఆడుతున్న ఈ తమిళ కుర్రాడు 639 పరుగులతో ప్రస్తుతం టాప్ రన్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. దీంతో సెలక్టర్లు ఈ 23 ఏళ్ళ కుర్రాడు ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ లో చోటు దక్కించుకున్నాడు. సాయి సుదర్శన్ కేవలం ఐపీఎల్ ప్రదర్శన ద్వారా జట్టులో స్థానం దక్కించుకున్నాడంటే పొరపాటే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా ప్రైమ్ 11 తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ బాదాడు. అంతేకాదు ఇంగ్లాండ్ గడ్డపై సర్రే తరఫున రెండు కౌంటీ సీజన్లలో ఆడిన అనుభవం ఉంది.