విచిత్ర వాతావరణం: రోహిణి కార్తెలో భారీ వర్షాలు...!

విచిత్ర వాతావరణం:  రోహిణి కార్తెలో భారీ వర్షాలు...!

రోహిణికార్తెలో ఎండలు  రోళ్లు పగిలేలా ఉంటాయని నానుడి . సూర్యభగవానుడు రోహిణి నక్షత్రంలో  ఉన్న సమయంలో రోజు రోజుకు వేడి పెరుగుతుంది. ఈ కాలంలో ఎండలకు రోళ్లు, రోకళ్లు పగులుతాయని పెద్దలు చెప్పిన విషయం మన మనలో మెదలాడుతూ ఉంటుంది.  ఈ ఏడాది రోహిణి కార్తె మే 25 న ప్రారంభమైంది.  అయితే ఈ ఏడాది అకాల వర్షాలు, అల్పపీడనం కారణంగా వేసవి కాలం.. వర్షాకాలంగా మారింది. 

ఈ ఏడాది ( 2025) మే 25 ఆదివారం నుంచి రోహిణి కార్తె ప్రారంభమైంది. ఈ ఏడాది 8 రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకడంతో ఇప్పుడు ఆ పరిస్థితి లేనట్లే కనిపిస్తోంది. మరో 2-3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి అవి ప్రవేశించడంతో రోళ్లు పగిలే ఎండలు ఉండవని భావిస్తున్నారు.

ALSO READ | తెలంగాణలో ఆరు జిల్లాల్లో భారీవర్షం.. ఎల్లో అలెర్ట్ జారీ

ఈ ఏడాది ( 2025)  వేసవికాలం తన సంప్రదాయ లక్షణాలను వదిలేసినట్లుగా కనిపిస్తోంది.  రోళ్లు .. రోకళ్లు పగిలేలా ఎండలు ఉండాల్సిన పరిస్థితి .. అయితే దానికి విరుద్దంగా వానలు కురుస్తుండటంతో విచిత్ర వాతావరణం నెలకొంది.  రోహిణి కార్తెలో వానలు  కురుస్తుండటంతో వేసవికాలంలో  వర్షాకాలం  వాతావరణం ఏర్పడింది. మే 25 న రోహిణి కార్తె ప్రారంభమైనా, తాపత్రయానికి బదులు చల్లదనమే అధికంగా కనిపిస్తోంది.

వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ... ఇప్పటికే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని ప్రకటించింది.  వీటి ప్రభావంతో వేడి తగ్గిపోయి వర్షాలు కురవడంతో రైతన్నలు వ్యవసాయ పనులకు శ్రీకారం చుడుతున్నారు.   అయితే అకా వర్షాల కారణంగా భూమి సారంలో తేడా వచ్చే అవకాశం ఉందని రైతన్నలు ఆందోళన  చెందుతున్నారు.  

ఈ మధ్య కాలంలో నెలలు నిండకుండా ప్రసవాలు జరిగినట్టు..ఈ ఏడాది (2025) నెల రోజులు ముందుగానే వర్షాకాలం ప్రారంభమైంది. ఇప్పుడు వర్షాలు పడి... సరైన సమయంలో వర్షాలు పడకపోతే పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తమవుతోంది.   ఖరీఫ్​ పంటను సాగుచేసే వారు.. వాతావరణంలో మార్పులు ఎలా ఉన్నా.. వారి జాగ్రత్తలో వారు ఉండటం మంచిది.. మరి రోహిణి కార్తెలో వర్షాలు రైతన్నలకు ఎంతవరకు మేలు చేకూరుతుందో వేచి చూడాలి. . .