ఛత్తీస్‌గఢ్‌లోని జాష్‌పూర్ జిల్లా రెసిడెన్షియల్ స్కూల్లో 15 ఏళ్ల బాలిక చనిపోయింది. ఆమె చనిపోయేముందు పేపర్ పై స్కూల్ ప్రిన్సిపాల్ తనని లైంగికంగా వేధించాడని ఆరోపించింది. 9వ తరగతి చదువుతున్న ఈ అమ్మాయి, ఆదివారం సాయంత్రం చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందింది.
పేపర్ పై రాసిన విషయాలు ఇతర ఆధారాలను బట్టి ప్రిన్సిపాల్‌ను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. అలాగే ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ ప్రదీప్ రథియా మాట్లాడుతూ, ఈ ఘటనపై ఉన్నతాధికారులతో విచారణకు ఆదేశించామని అలాగే విచారణ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా చనిపోవడానికిగల కారణాలు తెలుస్తాయని అన్నారు.
విద్య, గిరిజన సంక్షేమం & పోలీసు శాఖలకు చెందిన అధికారులు కలిసి స్కూల్ ని తనిఖీ చేయగా... ఎలాంటి అనుమతి లేకుండానే స్కూల్లో హాస్టల్ నడుపుతున్నట్లు విచారణలో తెలిసింది. 6 నుండి 12 క్లాస్ వరకు ఉన్న 124 మంది విద్యార్థులలో, 22 మంది అబ్బాయిలు, 11 మంది అమ్మాయిలు హాస్టల్‌లో ఉంటున్నారు. ఈ హాస్టల్ తప్పనిసరిగా తీసుకోవాల్సిన అనుమతులు లేకుండా నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
