
- యానిమల్ బ్రీడింగ్, డొమెస్టికేషన్ బిల్లుకు గోవా అసెంబ్లీ ఆమోదం
పనాజీ: క్రూరమైన, దుకుడు స్వభావమున్న జంతువుల పెంపకం, దిగుమతిని నియంత్రించేందుకు తీసుకొచ్చిన గోవా యానిమల్ బ్రీడింగ్ అండ్ డొమెస్టికేషన్ బిల్లు~2025 ను గోవా అసెంబ్లీ ఆమోదించింది. రాట్‌వీలర్, పిట్‌బుల్ వంటి దూకుడు ప్రవర్తన ఉన్న కుక్క జాతుల దాడుల నేపథ్యంలో ఈ బిల్లును సోమవారం గోవా అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టంది.ఇది బుధవారం ఆమోదం పొందింది. ఈ బిల్లును ఉద్దేశించి గోవా సీఎం ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ.. ప్రజల భద్రత కోసమే గోవా యానిమల్ బ్రీడింగ్ అండ్ డొమెస్టికేషన్ బిల్లును తయారు చేశామన్నారు. ఈ బిల్లు ప్రస్తుతం అసెంబ్లీలో ఆమోదం పొందిందని.. గవర్నర్ సంతకం తర్వాత చట్టంగా మారుతుందని చెప్పారు.
ఈ చట్టం..ఏ జంతు జాతినైనా "క్రూరమైనది"గా ప్రకటించే అధికారం ప్రభుత్వానికి ఇస్తుందని తెలిపారు. ఇకపై క్రూరమైన, దూకుడు స్వభావమున్న ప్రాణులను దిగుమతి చేసుకోవడం లేదా ఇంట్లో పెంచుకోవడం నిషేధిమన్నారు. రూల్స్ ఉల్లంఘిస్తే ఈ చట్టం ప్రకారం..3 నెలల జైలు శిక్షతో పాటు రూ. 50 వేల జరిమానా పడుతుందని హెచ్చరించారు. అంతేగాక, ఈ చట్టం జంతువు దాడులకు గురైన వారికి పరిహారం కూడా అందిస్తుందన్నారు. పెంపుడు జంతువుల యజమానుల బాధ్యతను పెంచుతుందని, ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తుందని వివరించారు. గోవాలో ఇటీవల కుక్క దాడులు, ముఖ్యంగా రాట్‌వీలర్, పిట్‌బుల్ జాతుల దాడి ఘటనలు ఎక్కువగా జరిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గోవా యానిమల్ బ్రీడింగ్ అండ్ డొమెస్టికేషన్ బిల్లును తెచ్చింది.